Vinod Panu : గ్యాంగ్స్టర్ వినోద్ పను అలియాక్ కనాను దుండగులు గురువారం కాల్చి చంపారు. హరియాణాలోని హిసార్లో ఉన్న కోర్టు గేటు బయట కాల్చిచంపారు. ఒక కేసు విచారణ కోసం వినోద్ కోర్టుకు వెళ్తుండగా, బైకుపై వచ్చిన దుండగులు అతడిపై గేటు బయట కాల్పులు జరిపారు. దాదాపు 12 రౌండ్ల కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
ముందుగా వినోద్ దగ్గరికి వచ్చిన దుండగులు సమీపం నుంచి వరుసగా కాల్పులు జరిపారు. అనంతరం రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఇద్దరు దుండగులు వేగంగా బైకుపై అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 2.00 గంటలకు జరిగింది. కాల్పుల ఘటనతో కోర్టు పరిధిలో ఉన్న వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొందరు తమను తాము రక్షించుకోవడానికి చుట్టుపక్కల పారిపోయారు. ఇక.. హరియాణా, హన్సి జిల్లాలోని, తరుణ గ్రామానికి చెందిన వినోద్ పను అక్కడ పేరు మోసిన క్రిమినల్. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్.
అతడిపై దాదాపు 40 వరకు క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో హత్య కేసులు కూడా ఉన్నాయి. వినోద్ హత్య అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రదేశం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ప్రదేశం మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాదాపు పదేళ్లుగా అతడిపై ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో పలు క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. గతంలో అతడిపై రూ.7 లక్షల రివార్డ్ కూడా ఉండేది.