Murder |లక్నో: మానస్ వాజ్‌పేయి అనే ఎస్బీఐ (SBI) బ్యాంక్‌లో ఉద్యోగి గురువారం మధ్యాహ్నం లక్నోలోని ప్రముఖ ప్రాంతమైన గోమతి నగర్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ బయట తన భార్యను కాల్చి చంపాడు. ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు. వారికి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 38 ఏండ్ల మానస్ వాజ్‌పేయి బ్యాంక్‌లో పనిచేస్తున్న తన భార్య దివ్య మిశ్రాను బయటకు పిలిచాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ ఉన్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
మానస్, దివ్యలకు 12 ఏండ్ల క్రితం వివాహం (Marriage) అయ్యింది. కొంతకాలంగా వారు విడిగా ఉంటున్నారు. దివ్య గతేడాది విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సమాచారం.
మానస్.. మానసిక సమస్యలతో బాధపడుతున్న తన 28 ఏండ్ల చెల్లెలు శివ వాజ్‌పేయి (Shiva Vajpayee)ని కూడా కాల్చి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకునేముందు తన భార్యను, చెల్లెలిని చంపిన విషయాన్ని వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. ఈ రోజు నన్ను మోసం చేసిన నా భార్యను చంపేశాను. నా చెల్లెల్లిని చంపి, నేను చనిపోతున్నాను. ఆమె చెల్లెలు ప్రజ్ఞ, అన్నీ అంతం కావాలి అని వాట్సప్ స్టేటస్‌లో రాశాడు.
మానస్ 12:30కు ఇంటికి వచ్చాడని, ఆందోళన, చెమటలు పట్టిన ముఖంతో కనిపించాడని పొరిగింటివారు చెప్పారు. ఇంటిలోకి వెళ్లిన అతడు హనుమాన్ చాలీసాను ప్లే చేశాడు. తరువాత అతడి వాట్సాప్ స్టేటస్ చూసి లోనికి వెళ్లి చూడగా మానస్ విగతజీవిగా కనిపించాడని వారు చెప్పారు. ఈ ఘటన గురించి దివ్య సోదరి ప్రజ్ఞ మిశ్రా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. నా సోదరిపై కాల్పులు జరిగాయని నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు. దయచేసి ప్రార్థించండి అని ఆమె యూపీ పోలీసులకు ట్యాగ్ చేశారు. మానస్ తన వాట్సప్ స్టేటస్‌లో ప్రస్తావించిన ప్రజ్ఞ ఈమె అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.