లక్నో, ఆగస్టు 13: నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఒంటరిగా నడుచుకుని వెళుతున్న ఓ 21 ఏళ్ల దివ్యాంగ యువతిని మూడు, నాలుగు మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. భయంతో పరుగులు తీసిన ఆ యువతిని వారు వెంటాడారు. ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంటి ముందు నుంచే ఆ బధిర యువతి తన మానాన్ని కాపాడుకునేందుకు పరుగులు తీసింది. అయినప్పటికీ ఆ మృగాళ్ల వేట ఆగలేదు. ఆమెను పట్టుకుని బలవంతంగా తమ మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని ఓ నిర్జన ప్రదేశం వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ఈ అమానుష ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధిత యువతి రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
పారిపోయేందుకు ప్రయత్నించినా..
తన మేనమామ ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న తన ఇంటికి ఆ దివ్యాంగ యువతి కాలినడకన బయల్దేరింది. అటుగా వచ్చిన ఓ బైక్‌రైడర్ ఆమెను అడ్డుకుని తన బైక్ ఎక్కమని ఒత్తిడి చేశాడు. భయంతో ఆ యువతి అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగులు తీసింది. ఇంతలో మరో మూడు బైకుల్లో అక్కడకు చేరుకున్న మరికొందరు ఆ యువతి వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను వెంటాడారు. చివరకు ఆమె ను పట్టుకుని ఒక బైకులో బలవంతంగా ఎక్కించుకున్నారు. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను గ్యాంగ్‌రేప్ చేశారని అదనపు ఎస్పీ విశాల్ పాండే తెలిపారు.
ఉన్నతాధికారుల నివాసాలకు సమీపంలోనే..
తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులకు చిరిగిన దుస్తులలో ఓ నిర్జన ప్రదేశంలో బాధితురాలు లభించింది. తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. వెంటనే ఆమెను జిల్లా దవాఖానకు తరలించిన పోలీసులు అక్కడ రోడ్డులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కొందరు నిందితులను గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన ఆ ఇద్దరు నిందితులు జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక ధ్రువీకరించిందని ఆయన తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, న్యాయమూర్తులతోసహా జిల్లాకు చెందిన ఉన్నతాధికారుల నివాసాలు ఉన్న ప్రదేశంలో ఈ ఘటన జరగడంపై బాధితురాలి కుటుంబంతోసహా స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలిపై అత్యాచారం జరిగిన ప్రదేశానికి అతి చేరువలో ఉన్న పోలీసు ఔట్‌పోస్టు వద్ద సీసీటీవీ పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు.
యోగీజీ.. మహిళలకు రక్షణ ఏదీ?
దివ్యాంగురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం పట్ల ఉత్తరప్రదేశ్‌లోని యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందో ఈ ఘటనే నిదర్శనమని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు విమర్శించాయి. బలరాంపూర్ ఘటనను అత్యంత హేయమైన నేరంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వర్ణించారు. శాంతి భద్రతలపై యోగి ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలను ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అటువంటి ప్రచారం చేసుకుంటున్న వారు ప్రజల కళ్లలోకి సూటిగా చూసి ఈ ఘటన గురించి మాట్లాడగలరా అని ఆయన నిలదీశారు.
బాధితురాలికి అన్ని రకాలుగా సాయం అందచేయాలని, ఉచితంగా వైద్య చికిత్సలు అందచేయాలని ఆయన డిమాండు చేశారు. నేరానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. తాజా ఘటనపై యూపీ కాంగ్రెస్ స్పందిస్తూ పోలీసు ఔట్‌పోస్టుకు కేవలం 20 మీటర్ల దూరంలో అపస్మారక స్థితిలో బాధితురాలిని వదిలేసి దుండగులు పారిపోయారని తెలిపింది. ఐదారుగురు వ్యక్తులు బైకులలో వెంటాడుతుంటే బాధితురాలు ప్రాణరక్షణ కోసం పరుగులు తీయడం ఎస్పీ నివాసం వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పేర్కొంది. పోలీసు స్టేషన్లు, ఎస్పీ నివాసం సమీపంలోనే ఆడ బిడ్డలకు రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని కాంగ్రెస్ విమర్శించింది.