జయశంకర్ భూపాలపల్లి : కార్మికులకు పనిచేసే స్థలాల్లో రక్షణ పరికరాలు ఇవ్వడంలో యాజమాన్యం, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇంక్లైన్ గని ఆవరణలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన టీబీజీకేఎస్ గేట్ మీటింగ్కు ఆయన టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం కాంట్రాక్టర్ల చేత నాసిరకం పరికరాలను కార్మికులకు అందజేయడం సిగ్గుచేటన్నారు. పాడైన డ్రిల్ రాడ్లకు మరో భాగాన్ని జత చేసి ఇవ్వడం ఇవ్వడం వల్ల కార్మికులపై పని భారం పెరిగి కోల్ కట్టర్లు, సార్ట్ మెన్స్, టింబర్ మెన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇంతవరకు యూనిఫామ్స్, షూస్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కేటీకే-5 ఇంక్లైన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం
కేటీకే – 5వ గని ఆవరణలో నిర్వహించిన టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించేందుకు గండ్ర వెంకటరమణారెడ్డి, మిరియాల రాజిరెడ్డి వెళ్తుండగా గని ముందు ప్రధాన గేటు వద్ద వారిని మీటింగ్కు వెళ్లకుండా ఎస్ అండ్ పిసి సిబ్బంది, సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము సామరస్యంగా గేట్ మీటింగ్ పెట్టి వెళ్లిపోతామని చెప్పినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో గేట్లను బలవంతంగా నెట్టుకొని గని లోపలికి వచ్చారు. దీంతో సెక్యూరిటీ, టీబీజీకేఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.