SaiKumar | రాజకీయాలు అంటే కేవలం ఓట్ల వేట, పదవుల కోసం పాకులాట మాత్రమే కాదని, అది ప్రజల భవితను నిర్ణయించే బాధ్యత అని చెప్పే ప్రయత్నమే ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని, యువతను పెడదోవ పట్టిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని ప్రశ్నిస్తూ రూపొందిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ
ధర్మస్థల నియోజకవర్గంలో ఎలాంటి పోటీ లేకుండా వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న బైరాజ్ (సాయికుమార్) అరాచకాలకు అడ్డులేకుండా పోతుంది. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని ఆ నాయకుడి ఏకఛత్రాధిపత్యానికి, ఒక సాధారణ టీ షాపు నడుపుకునే ఈశ్వరయ్య (సుమన్) అనూహ్యంగా ఎదురునిలబడి రాజకీయంగా సవాల్ విసురుతాడు. అసలు ఆ రాజకీయ దిగ్గజంపై సాధారణ టీ కొట్టు వ్యక్తి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఈశ్వరయ్య కుమారుడు బద్రి (నటరాజ్) మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? కాలేజ్ లెక్చరర్ అరుంధతి (వితికా షేరు) సాగిస్తున్న ఒంటరి పోరాటం దేనికి సంకేతం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ చిత్ర కథాంశం.
విశ్లేషణ
ఒక నియోజకవర్గంలో జరిగే రాజకీయ క్రీడను ఆధారంగా చేసుకుని, దేశం మొత్తానికి వర్తించేలా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడంలో చిత్ర యూనిట్ విజయం సాధించింది. నేటి యువతను డ్రగ్స్ ఏవిధంగా నాశనం చేస్తున్నాయి, రాజకీయ నాయకులు వాటిని ఎలా తమ లబ్ధికి వాడుకుంటున్నారు అనే కోణాలను చాలా స్పష్టంగా చూపించారు. వల్గారిటీకి తావు లేకుండా, కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఇది. రాజకీయంలో నిజాయితీ ఉంటే ప్రజలు ఎంతగా ఆదరిస్తారనే అంశాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.
నటీనటులు
సుమన్ మరియు సాయికుమార్: ఇద్దరు సీనియర్ నటులు తమ అనుభవంతో తెరపై పోటీపడి నటించారు. ఒకరు రాజకీయాధిరుడిగా దర్పం ప్రదర్శిస్తే, మరొకరు నిరుపేద తండ్రిగా, ఆవేశపరుడైన వ్యక్తిగా జీవించారు. సాయికుమార్ పలికించిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. ఇక సమాజహితం కోరే లెక్చరర్ పాత్రలో వితికా పరిణతి ప్రదర్శించారు. ఆమె పాత్ర ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న సామాజిక సందేశం బలంగా పండింది. సత్య ప్రకాష్ తనయుడిగా పరిచయమైన నటరాజ్ నటనలో పరిపక్వత కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కీలకమైన ట్విస్ట్‌తో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది. ఆయన సరసన రాయంచ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ప్రత్యామ్నాయ విలన్ పాత్రలో కస్తూరి తనదైన శైలిలో నటించారు. వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల, శివ తమ పరిధి మేరకు మంచి నటనను కనబరిచారు.
సాంకేతికంగా
ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ఆత్మలా నిలిచింది. ప్రతి పాట కథను ముందుకు నడిపేలా, ఆలోచింపజేసేలా సాగింది. మహావీర్ ఎల్లంధర్ సంగీతం, వెంకట హనుమ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయి. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట ఎంచుకున్న పాయింట్ చాలా బోల్డ్ అండ్ రియలిస్టిక్. ప్రథమార్థంలో వేగంగా నడిచే కథనం, ద్వితీయార్థంలో మరింత భావోద్వేగభరితంగా మారుతుంది. అయితే కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ, దర్శకుడి నిజాయితీ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
బలమైన కథాంశం మరియు సామాజిక సందేశం
సుమన్, సాయికుమార్ నటన
చంద్రబోస్ సాహిత్యం మరియు సంగీతం
ద్వితీయార్థంలోని భావోద్వేగ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
కొన్ని సన్నివేశాలలో ఊహక అందే కథనం
నెమ్మదించిన స్క్రీన్ ప్లే పార్ట్స్
తుది తీర్పు
ఈ వారాంతంలో ఒక ప్రయోజనాత్మకమైన, ఆలోచనాత్మకమైన చిత్రాన్ని చూడాలనుకుంటే ‘ధర్మస్థల నియోజకవర్గం’ మంచి ఛాయిస్ అవుతుంది.
రేటింగ్: 2.75/5