Gali Janardhan Reddy | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్అలీ ఖాన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్లతోపాటు మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది.
వారితోపాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీలను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. ఈ ఉత్తర్వులు జారీ చేయకపోతే ఎమ్మెల్యేగా గాలి జనార్దన్‌రెడ్డి ప్రజలకు సేవ చేయలేరని.. దీనికితోడు ఇప్పటికే సగానికి పైగా శిక్ష అనుభవించారని న్యాయమూర్తి పేరొన్నారు. రాజగోపాల్, శ్రీనివాస్‌రెడ్డి వయసు, వారి ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఓఎంసీ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారిణి ఎం శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఆదేశించినా ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని ఆక్షేపించింది. ఇలాగే తాత్సారం చేస్తే తదుపరి విచారణకు సీబీఐ డీఐజీని హాజరుకావాలని ఆదేశాలు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది.