సోషల్‌మీడియాలో రీల్స్ చేయొద్దని భర్త మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భార్య బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ములుగు మండలం మామిడాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన తేజస్విని (35)కి జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని నార్కోటిక్స్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబం గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీ ప్రసన్ననగర్ కాలనీలో నివాసం ఉంటోంది.
కొంతకాలం క్రితం తేజస్విని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, వాటిని పోస్టు చేయడం మొదలుపెట్టారు. అయితే ఆమె తరచూ రీల్స్ చేయడంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి.
రీల్స్ చేయడం, పోస్టు చేయడం మానుకోవాలని భర్త మందలించడంతో తేజస్విని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.