
బీజింగ్: చైనాలో మత పరమైన వ్యవహారాలపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచాలని అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. అన్ని మతాలను చైనీకరించాలని కూడా ఆయన చెప్పారు. మతసంబంధ విషయాలపై వారాంతంలో జరిగిన జాతీయ మహాసభలో జిన్పింగ్ మాట్లాడుతూ.. మత నాయకులపై ప్రజాస్వామిక పర్యవేక్షణను మెరుగుపర్చడం చాలా అవసరమని, మతవ్యవహారాల్లో చట్టబద్ధత గురించి నొక్కిచెప్పాలని స్పష్టంచేశారు. 2016 తర్వాత ఈ తరహా సమావేశం జరగడం ఇదే ప్రథమం. చైనాలో 20 కోట్ల మంది బౌద్ధులు, 2 కోట్లమంది ముస్లింలు, 3.8 కోట్లమంది
ప్రొటెస్టెంట్ క్రైస్తవులు, 60 లక్షల మంది క్యాథలిక్కు క్రైస్తవులు ఉన్నారు. సుమారు 1,40,000 ఆరాధనా మందిరాలున్నాయి. అధికారికంగా నాస్తికత్వాన్ని సమర్థించే చైనా కమ్యూనిస్టు పార్టీ అన్నిరకాల మత వ్యవహారాల్లో ఉక్కు క్రమశిక్షణను అమలు చేస్తుంది.