బజార్హత్నూర్ : సీఆర్పీఎఫ్ జవాన్‌గా ( CRPF Jawan ) జార్ఖండ్‌లో ( Jharkhand) విధులు నిర్వహిస్తున్న మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన ఆర్క మేఘనాథ్( Meghanath ) విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి సోమవారం ఉదయం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంతిమ యాత్రలో పాల్గొని నివాళి అర్పించారు. పోలీస్ స్టేషన్ నుంచి జాతర్ల గ్రామం వరకు యువకులు, గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ జాతర్లలో జరిగిన అంతః క్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్ మేఘనాథ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జవాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా వెళ్లి దేశ సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టమని, అనారోగ్యంతో జవాన్ మేఘనాథ్ చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
మేఘనాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గిరిజన శాఖ ద్వారా కుటుంబానికి న్యాయం జరిగిలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ప్రభుత్వ లాంఛనాలతో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ వినయ్ రెడ్డి, జవాన్లు పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి గౌరవ వందనం చేపట్టి దహన సంస్కారా లు చేపట్టారు.