మిర్యాలగూడ, ఫిబ్రవరి 27 : పొదుపు పేరిట పేద, మధ్యతరగతి మహిళలను భారీగా మోసం చేశారు. కట్టిన డబ్బుకు రెట్టింపు సొమ్ము ఇస్తామని నమ్మించి కోటీ 20 లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు వెలుగులోకి వచ్చింది.దాంతో తమకు న్యాయం చేయాలని బాధితు లు సోమవారం ఆర్డీఓ,డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడకు చెందిన కృష్ణవేణి, శంకర్, వేణుగోపాల్, నరేశ్, శ్రీనివాస్ కొన్నేండ్ల క్రితం స్నేహ పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేశారు. సమాఖ్యలో పొదుపు చేసిన డబ్బుకు ఏడేండ్లలో రెట్టింపు ఇస్తామని మహిళలను నమ్మించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంట, తాళ్లగడ్డ, బంగారుగడ్డ, వినోద్‌నగర్, ఈదులగూడ ప్రాంతాలకు చెందిన సుమారు 3,500 మంది మహిళలు నెలకు వంద రూపాయల చొప్పున 2010 నుంచి 2017 వరకు పొదుపు చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లకు మూడేండ్లలో డబుల్ ఇస్తామని చెప్పడంతో మరికొంత మంది ఎక్కువ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
కాలపరిమితి ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో బాధిత మహిళలు 2017లో మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో సంస్థ నిర్వాహకులు కృష్ణవేణితోపాటు శంకర్, వేణుగోపాల్, నరేశ్, శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆడిట్ ద్వారా కోటీ 20లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. పోలీసుల జోక్యంతో బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన నిందితులు ఇంత వరకూ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏండ్లేండ్లుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధిత మహిళలు సోమవారం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటగిరికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మల్లు గౌతం రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, పోలెబోయిన వరలక్ష్మి, చెనగోని యాదగిరి, దైదాభిక్షం, లెంకల మాధవరెడ్డి, ఆకారపు రాములు, రామారావు, బాధితులు నాగమణి, గోవిందమ్మ, అంజమ్మ, దుర్గయ్య, దేవరబోయిన అంతమ్మ సుమారు 300 మంది బాధితులు పాల్గొన్నారు.