పారిస్: ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకొర్ను, ఆయన ప్రభుత్వం సోమవారం రాజీనామా చేసింది. లెకొర్ను తన క్యాబినెట్ మంత్రులను ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. దీని ఫలితంగా షేర్ల ధరలు, యూరో విలువ బాగా పడిపోయాయి. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మిత్రులు, శత్రువులు బెదిరించిన తర్వాత తన పనిని తాను చేయలేనంటూ, ఊహించని విధంగా లెకొర్ను రాజీనామా చేశారు.
దీంతో అధ్యక్షుడు మాక్రాన్ వెంటనే రాజీనామా చేయాలని లేదా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. లెకొర్ను తన పదవిలో కేవలం 27 రోజులు మాత్రమే ఉన్నారు. ఆయన ప్రభుత్వం 14 గంటలు మాత్రమే మనుగడ సాగించింది. ఆధునిక ఫ్రెంచ్ చరిత్రలో అత్యల్ప కాలం కొనసాగిన ప్రభుత్వంగా నిలిచింది. తాజా సంక్షోభం నేపథ్యంలో మాక్రాన్ తన పదవికి రాజీనామా చేయడం కాని, కొత్త ప్రధానిని నియమించడం కాని లేదా ముందస్తు ఎన్నికలు నిర్వహించడం కాని చేయాల్సి ఉంటుంది.