ఆదిలాబాద్ రూరల్, మార్చి 11 : ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు కోచింగ్‌తో పాటు భోజన వసతి కల్పిస్తామని, త్వరలోనే స్థలం, తేదీలు ప్రకటిస్తామని అన్నారు. జిల్లాలో 1,193 ఉద్యోగాలను ఆయా శాఖల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 15లక్షల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అశ్రఫ్, కౌన్సిలర్లు బండారి సతీశ్, భరత్, రాంకుమార్, పండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.