హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన తరగతికి చెందిన లక్ష మంది నిరుపేద ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు బీసీ సంక్షేమశాఖ సమగ్ర కార్యాచరణను రూపొందించింది. వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆఫ్‌లైన్ ద్వారా 50 వేల మంది, ఆన్లైన్ ద్వారా 50 వేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా 50 వేల మంది బీసీ ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్రూప్స్, జనరల్ స్టడీస్, తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలకు సంబంధించి ప్రతిరోజూ 100 ప్రశ్నలను ఉద్యోగార్థులకు ఇస్తున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సేవలను ప్రారంభించిన 15 రోజులకే 3 వేల మందికిపైగా బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు.
యూట్యూబ్ ద్వారా గ్రూప్స్, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంక్, యూపీఎస్సీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి దాదాపు 300కు పైగా వీడియోలను ఉద్యోగార్థులకు అందుబాటులో ఉంచిం ది. మరో సామాజిక మాధ్యమం టెలిగ్రామ్ ద్వారా కూడా ఉద్యోగార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను అందించేందుకు బీసీ స్టడీ సర్కిల్ చర్యలు చేపట్టింది. నిపుణుల ద్వారా సందేహాల నివృత్తికి వెసులుబాటు కల్పించింది. ఫేస్బుక్ ద్వారా కూడా వీడియో పాఠాలను అందించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ఉద్యోగార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ప్రత్యేకంగా యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ‘తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్’ పేరిట ఇప్పటికే యాప్‌ను డిజైన్ చేసింది. అభ్యర్థులు తమ పేరు, ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ కావాల్సి ఉంటుం ది. మొత్తంగా 15 రోజుల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీసీ స్టడీ సర్కిల్ అన్ని చర్యలు చేపట్టింది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా భారీమొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టడం హర్షణీయం. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షల తర్ఫీదు కోసం బీసీ ఉద్యోగార్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు. సీఎం మార్గనిర్దేశాల మేరకు స్టడీ సెంటర్లను త్వరలోనే ప్రారంభిస్తాం. డిజిటల్ వీడియోల ద్వారా శిక్షణ ఇప్పిస్తాం. పేద, మధ్యతరగతికి చెందిన లక్ష మంది ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– అలోక్‌కుమార్, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్