సామాజిక సేవా సంస్థలకు వినోద్ పిలుపు
హనుమకొండ, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో లయన్స్‌క్లబ్, రోటరీ క్లబ్ వంటి సేవాసంస్థలు నిరుద్యోగుల కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసి, ఉచితంగా మెటీరియల్‌ను అందజేయాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ వాల్మీకి రీజనల్ మీట్‌కు వినోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ వాల్మీకి రీజనల్ ముందుకు రావాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిందని, స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత అదే నినాదాన్ని నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని స్పష్టంచేశారు.