సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆ ముఠా దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో వందలాది ఏటీఎంలలో తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించింది. వీరి వ్యవహారాన్ని ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఉత్తర్ప్రదేశలోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్ అలీ ముఠాను ఏర్పాటు చేశాడు. అందులో ముంబైకి చెందిన జమీర్ షేక్, సాగిర్, మహ్మద్ ఉమ్మర్, మెహరాజ్లను సభ్యులుగా చేర్చుకున్నాడు. ఏటీఎంలను హ్యాక్ చేసి డబ్బులు దోచుకోవాలన్నది వారి ప్రధాన లక్ష్యం. అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం కోసం తమకు పరిచయమున్న హైదరాబాద్‌కు చెందిన కమల్‌ను సంప్రదించారు.
మాల్వేర్ పంపించి హ్యాక్
కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మిషన్ల హ్యాకింగ్ మాల్వేర్ను డౌన్లోడ్ చేసుకొని యూఎస్బీ డ్రైవ్‌లో వేసి షానవాజ్ గ్యాంగ్‌కు అందించాడు. ఏటీఎంల దోపిడీకి వెళ్లినప్పుడు ఆ మాల్వేర్ను మిషన్‌కు అనుసంధానించడంతో ప్రధాన సర్వర్‌తో సంబంధాలు కోల్పోతుంది. అదే సమయంలో ఈ మాల్వేర్ ఓ కోడ్‌ను సృష్టించి కమల్ పొందుపర్చిన మెయిల్ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్‌లోనే ఉండి దానిని అధ్యయనం చేసి పాస్వర్డ్ రూపొందించి దానిని కమల్ షానవాజ్‌కు ఫోన్లో చెప్పేవాడు. దాని ఆధారంగా ఏటీఎం మిషన్ రీబూట్ అయ్యేలా చేసి డబ్బులను దోచుకునేవారు. ఇదే తరహాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో సుమారు 200 ఏటీఎంలను కొల్లగొట్టారు. ఇలా కాజేసిన మొత్తంలో కమల్‌కు ఐదు శాతం ముట్టేది.
లంచం ఎరచూపి తప్పించుకున్నారు..
గతంలో వీరి ఆటకట్టించేందుకు ఘజియాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితం నోయిడాలో షానవాజ్‌ను అరెస్టు చేయగా, లంచం ఎరచూపి తప్పించుకున్నాడు. రూ.20లక్షల నగదుతో పాటు ఎస్యూవీ వాహనాన్ని సైతం ఆ టీంకు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షానవాజ్‌తో పాటు ఐదుగురు ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారిని విచారించగా నోయిడా స్వాట్ టీమ్ ఉదంతం బయటపడటంతో అందులో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ఉన్న కమల్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.