France Doctor : వైద్యుడి (Doctor) ని భగవంతుడితో పోలుస్తారు. భగవంతుడు (God) ప్రాణం పోస్తే, వైద్యుడు ప్రాణాలు కాపాడుతాడని అంటారు. ఏదైనా ప్రాణాపాయ రోగం వస్తే వైద్యుడిపైనే భారం వేస్తారు. అతడే తమ ప్రాణాలు కాపాడుతాడని నమ్ముతారు. కానీ ఫ్రాన్స్ (France) కు చెందిన ఓ వైద్యుడు మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. 30 ఏళ్లుగా వైద్యం ముసుగులో రోగుల (Patients) పై పైశాచికంగా అత్యాచారాలకు పాల్పడ్డాడు. తన సర్వీసు మొత్తమ్మీద ఏకంగా 299 మందిపై లైంగిక దాడి చేశాడు.
వారిలో ఎక్కువ మంది చిన్న వయసు బాలికలే ఉన్నారు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న డాక్టర్ కామ క్రీడలు అనుకోకుండా ఓ కేసుతో బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్ (Joyel Lee Scournek) అనే వైద్యుడు ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో గతంలో సర్జన్‌గా పనిచేసేవాడు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు చికిత్స పేరుతో మత్తు మందు ఇచ్చి తన కోరికలు తీర్చుకునేవాడు. సర్వీస్‌లో ఉండగానే నన్నెవరూ పట్టుకోలేదు.. ఇప్పుడెవరు కనుక్కోగలరనే ధీమాతో 70 దాటాక కూడా అదే నీచపు పనిని కొనసాగించాడు.
కానీ 2017లో ఇంటి పక్కనే ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడనే ఆరోపణలతో తొలిసారి జోయెల్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత కూడా నలుగురు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఈ కేసు కోర్టులో నిరూపణ కావడంతో జోయెల్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఈ కేసును మరింత లోతుగా విచారించాలనే ఉద్దేశంతో పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పుడే జోయెల్ దారుణాల చిట్టా మొత్తం బయటికొచ్చింది. నిందితుడి ఇంట్లో ఏకంగా 3 లక్షలకుపైగా అశ్లీల ఫొటోలు, 650 అసభ్యకరమైన వీడియోలు లభ్యమయ్యాయి.
జోయెల్ ఇంట్లో లభ్యమైన డైరీలోని వివరాలు చూసి పోలీసు అధికారులు కంగుతిన్నారు. ఎవరెవరిపై లైంగిక దాడికి పాల్పడింది పేర్లతో సహా రాసి పెట్టుకున్నాడు. జంతువులు, చిన్నారులే తనను ఎక్కువగా ఆకర్షిస్తారని నోట్ చేసుకున్నాడు. డైరీలోని లెక్కల ప్రకారం ఈ మాజీ సర్జన్ తన జీవితకాలంలో మొత్తం 299 మందిపై అత్యాచారం చేశాడు. ఇదిలావుంటే డైరీలో తమ పేర్లు ఉన్నాయని తెలిసిన బాధితులు తమకీ విషయం ఇంతవరకు తెలియనే తెలియదని వాపోతున్నారు.
వైద్యం ముసుగులో ఎంతో మంది జీవితాలను నలిపేసిన జోయెల్ కేసు ఇటీవల కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో నిందితుడు తాను 1989 నుంచి 2014 మధ్య 299 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. వీరిలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నట్లు అంగీకరించాడు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని, ఈ నేరాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు. విచారణ పూర్తయ్యాక నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.