సీసీసీ నస్పూర్/మందమర్రి రూరల్, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలో ఇటీవల రోడ్లు రక్తమోడుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపటంతో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌లో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడగా, ఆటో డ్రైవర్.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మండలం గుడిపెల్లి, పొన్నారం గ్రామాలకు చెందిన ఏడుగురు కూలీలు నిత్యం వెళ్లే ఆటోలో పనుల కోసం సోమవారం మంచిర్యాలకు బయలుదేరారు. నస్పూర్ గేట్ మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి రాంగ్ రూట్లోకి వెళ్లింది. అదే సమయంలో మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ, ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలతో పాటు డ్రైవర్ చెల్లా చెదురుగా పడిపోయారు.
అగ్గు సౌందర్య(38), చింతకుంట్ల లక్ష్మి(28) అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, సీసీసీ నస్పూర్ ఎస్సై తహసీనుద్దీన్ ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఆరుగురిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇందులో తోగరి సుమలత (25), తోటపల్లి సోనీ(24) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటోడ్రైవర్ సెగ్గం ప్రశాంత్, సల్లూరి అనూషను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. మరో ఇద్దరు మహిళలు రామటెంకి దివ్యవాణి, సరమళ్ల లక్ష్మి చికిత్స పొందుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.