న్యూఢిల్లీ/ముంబై, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రష్యాలో మెడిసిన్ చదువుతున్న నలుగురు భారతీయ విద్యార్థులు ఓ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని రక్షించారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతున్నది. మన దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యాలోని వెలికీ నోవ్‌గోరోడ్‌లో ఉన్న యారోస్లావ్ ది వైజ్ నోవ్గోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వీరు చదువుతున్నారు. వీరు మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందినవారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వెంటనే స్పందించి, స్థానిక అధికారులతో, విశ్వవిద్యాలయంతో సంప్రదిస్తూ, సహాయం అందిస్తున్నది. అదేవిధంగా మహారాష్ట్రలోని జలగావ్లో ఉన్న ఈ విద్యార్థుల కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.