Telangana | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం సరిదిద్దాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్షల మంది నిరుద్యోగులకు స్వయంగా అన్యాయం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూశాఖ తీసుకున్న ఓ నిర్ణయంపై ఐటీఐ, బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించిన వాళ్లు కూడా ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగుల మధ్యనే ప్రభుత్వం కొత్త పంచాయితీ పెట్టిందని మండిపడుతున్నారు. భూభారతి బిల్లు అమలు కోసం జరుగుతున్న సన్నాహాల్లో భాగంగా 1000 మంది సర్వేయర్లను నియమించాలని రెవెన్యూశాఖ భావిస్తున్నది. ఇందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఇంటర్ చదివినవారి నుంచి ‘విల్లింగ్’ లెటర్లు తీసుకుంటున్నది. ఇంటర్లో మ్యాథ్స్ చదివితే చాలు అర్హులు అని స్పష్టంచేసింది. ఈ నియామకాలను నిరుద్యోగులు, ప్రభుత్వ సర్వేయర్లు వ్యతిరేకిస్తున్నారు.
మా పొట్ట కొడుతున్నారు
ప్రభుత్వ నిర్ణయంతో లక్షలమంది నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా నియమిస్తే తమకు అన్యాయం జరుగుతున్నదని వాపోతున్నారు. సర్వేయర్ పోస్టుకు సాంకేతిక కోర్సులు చేసినవారు మాత్రమే అర్హులని చెప్తున్నారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం 2017 జూన్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 273 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు డ్రాఫ్ట్‌మెన్(సివిల్), ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్‌మెన్, ఇంటర్ వొకేషనల్‌లో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంఈ చేసినవారు మాత్రమే అర్హులు అని నోటిఫికేషన్లో పేర్కొంది. కానీ ప్రభుత్వం ప్రస్తుతం సర్వేయర్ల పోస్టులకు ఇంటర్లో గణితం ఏకైక అర్హతతో ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని నిరుద్యోగులు చెప్తున్నారు. ఈ పోస్టుల కోసం ఏండ్లుగా సన్నద్ధమవుతున్న వాళ్లకు ప్రభుత్వ నిర్ణయంతో అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
భూ సమస్యలు పెరిగే అవకాశం!
పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించడాన్ని ప్రస్తుత సర్వేయర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. సర్వే అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుందని చెప్తున్నారు. కేవలం గణితం చదివినవారిని తీసుకొస్తే ఎలాంటి ఫలితం ఉండదని స్పష్టంచేస్తున్నారు. తమకు సర్వే పద్ధతులు, ఆధునిక టెక్నాలజీని వినియోగించే సామర్థ్యం ఉన్నదని, శిక్షణ లేని వారిని నియమిస్తే కొలతల్లో లోపాలతో తప్పుడు రికార్డులు నమోదవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహకరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఏడాది క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఖాళీల వివరాలు సేకరించింది. నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ ఏడాది పాలనలో నోటిఫికేషన్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులను నియమించుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నదని మండిపడుతున్నారు.