తిరుమల : భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తిరుమలకు (Tirumala) వచ్చే వీఐపీ భక్తులకు( VIP Devotees) పలు ఆసక్తికర సూచనలు చేశారు . సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.
సామాన్య భక్తుల కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో బయట ఎంత మంచి ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల రద్దీ కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను తీసుకువస్తే దేవస్థానం నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులందరూ భాద్యతతో హుందాగా ఈ సూచనను పాటించాలని కోరారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.