హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ముస్లిం సమాజంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం తీవ్రస్థాయిలో స్పందించారు. ‘కాంగ్రెస్‌తోనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుందని మాట్లాడుతున్నవు రేవంత్‌రెడ్డీ.. వేల సంవత్సరాల నుంచే ముస్లింలు ఉన్నారు. నీ పార్టీ ఎప్పుడు పుట్టింది’ అంటూ విరుచుకుపడ్డారు. తాజ్‌మహల్ నీ అయ్య కట్టిండా? ఎర్రకొట నీ బాబాయ్ కట్టిన్రా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాకుంటే మౌనంగా ఇంట్లో కూర్చో.. అంతేగానీ ఇలాంటి పిచ్చిమాటలెందుకని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి ఇబ్రహీం చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
వేలాది మంది ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి చెప్పింది ముమ్మాటికీ నిజమేనని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి మాటలు తప్ప చేతలు తెలియదని, జూబ్లీహిల్స్‌లో ఓడిపోవడం ఖాయమని తెలిసే ఇలా తెలివితక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ముస్లిం సమాజమంతా ఏకమై జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్తామని మరికొందరు యువకులు ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా వేదికలుగా హెచ్చరించారు.