న్యూఢిల్లీ, జూలై 7: మూడు దశాబ్దాల పాటు 220 కోట్ల యువాన్లకు పైగా(దాదాపు రూ 3,074 కోట్లు) ముడుపులుగా స్వీకరించిన కేసులో దోషిగా తేలిన మాజీ సీనియర్ నగర అధికారికి చైనా మరణశిక్ష విధించింది. ఇటీవలి కాలంలో ఆ దేశంలోని అతి పెద్ద అవినీతి కేసులలో ఇది ఒకటి. 1993-2023 కాలంలో నాన్జింగ్లో అనేక ప్రభుత్వ పదవులో యాంగ్ యూలిన్(69) పనిచేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ట్ తెలిపింది. లంచంతోపాటు నిధుల చోరీ, అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్ వంటి నేరాలకు కూడా ఆయన పాల్పడినట్లు రుజువైంది. అధ్యక్షుడు జీ జిన్పింగ్ చేపట్టిన రాజకీయ అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ కేసు వెలుగు చూసింది. కమ్యూనిస్టు పార్టీని ప్రక్షాళన చేసే ప్రయత్నంగా ఈ పోరాటాన్ని ప్రభుత్వం చిత్రీకరించినప్పటికీ దానిపై విమర్శలొచ్చాయి.