హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ హయాంలో నిజామాబాద్‌లో కట్టించిన 396 డబుల్ బెడ్రూం ఇండ్లకే కాంగ్రెస్ సర్కార్ తాజాగా పట్టాలిచ్చిందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తెలిపారు. తెలంగాణ భవన్లో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామ్మూర్తితో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఇండ్లను కూడా మంత్రి పొంగులేటి తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇండ్ల వద్దకు వెళ్లేందుకు ముఖం లేకే ఆడిటోరియంలో పట్టాలిచ్చి చేతులు దులుపుకొన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదని మాజీ మంత్రి పోచారంను పక్కన పెట్టుకొని పొంగులేటి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆయన వెంట నే నిజామాబాద్ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్క డా లేనివిధంగా ఒక్క బాన్సువాడలో 11,500 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో నిజామాబాద్‌కు 1500 ఇండ్లు మంజూరు చేసి, కట్టింది కేవలం 300 మాత్రమేనని దెప్పిపొడిచారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు
నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మ క్కు రాజకీయాలు చేస్తున్నాయని బిగాల గణేశ్ విమర్శించారు. పొంగులేటి పర్యనటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు 50 మందితో హడావుడి చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.ఆందోళన చేస్తామనగానే బీఆర్ఎస్ నేతలను హౌస్అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలోనే కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపడుతామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, సీఎం అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు.
కమీషన్లు దండుకొనేందుకే ప్రజల ఆస్తులు, భూములను 22ఏలో చేర్చారని మండిపడ్డారు. నిషేధిత జాబితా విషయంలో రాష్ట్రం మొత్తం రగిలిపోతుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశీటూర్లల్లో మునిగితేలడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే మంత్రులను 30 శాతం మంత్రి.. 20 శాతం మంత్రి.. 12 శాతం మంత్రి అంటూ పిలుస్తున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని దెప్పిపొడిచారు. మంత్రి కొండాసురేఖ కూతురు సుస్మిత సీఎంపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉన్నదని అన్నారు.