(25న డాక్టర్ దేవులపల్లి రామానుజరావు జయంతి సందర్భంగా..)
కాకతీయుల గడ్డపై పుట్టి కలాన్ని చేతబట్టి, కలంతోపాటు పరుగులు పెట్టి తెలంగాణ చైతన్యాన్ని కలవరించిన నిత్యకృషీవలుడు, తెలుగు పలవరించిన తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు. ఆధునికాంధ్ర సాహిత్యరంగంలో వివిధ శక్తులకు, విభిన్న ధోరణులకు సువర్ణ హేతువుగా ఉన్న అసాధారణ వ్యక్తి ఆయన. 20వ శతాబ్దిలో సుమారు ఐదు దశాబ్దాల కాలం భాషా సాంస్కృతిక వికాస యుగాన్ని ఆయన శాసించారు. విమర్శకుడిగా, సంపాదకుడిగా, స్వీయ చరిత్ర రచయితగా, బాలల కోసం నిఘంటువు వాంగ్మయం రచయితగా, ఉపన్యాసకుడిగా, అనువాదకుడిగా, బహుభాషావేత్తగా, విద్యా పాలనావేత్తగా నిరంతరం బహు కార్యాల్లో ఆయన నిమగ్నమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే; తెలుగు సాహితీక్షేత్రంలో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత నిలబడే వ్యక్తిగా దేవులపల్లిని పేర్కొనవచ్చు.
నిజాం కాలంలో తెలుగు మాట్లాడడం, చదవడం నేరమన్నట్లున్న పరిస్థితి. ఉర్దూ అధికార భాష. హిందువులు సైతం షేర్వాణీ, పైజమా ధరించేవారు. ఇండ్లల్లో బంధుమిత్రులు ఇతరులతో ఉర్దూలోనే మాట్లాడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగును నిలబెట్టిన వైతాళికుడు రామానుజరావు.
‘అనార్కలి’, ‘సంక్రాంతి’, ‘ఉగాది’, ‘తొలకరి’ వంటి 21 ఖండికలతో విరాజిల్లుతున్న పచ్చతోరణం ఖండకావ్యం ఆధునిక కవిత్వంలోని తొలి ఉద్యమ భావ కవిత్వరీతికి ఒక మంచి ఉదాహరణగా చూపుతూ తెలంగాణలో తొలి భావ కవిగా దేవులపల్లి రామానుజరావును సమర్థించవచ్చు.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సీమాంధ్ర-తెలంగాణ ప్రాంతాల మధ్య స్వభావ తారతమ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ పరిశోధనలు ముమ్మరమైన క్రమంలో ఈ తారతమ్యాలపై పలువురి దృష్టి నిలిచింది. సీమాంధ్ర..అందులోనూ ప్రధానంగా మధ్య కోస్తా ప్రాంతంపై ఇంగ్లిషు సాంస్కృతిక ప్రభావాలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన బాగా స్థిరపడింది. ఇంగ్లిషు విద్యతో పలువురికి చక్కని పరిచయం ఏర్పడింది. దీంతో ఇంగ్లిషు సాహిత్యంలోని అతి నవ్య నవీన ధోరణులు కోస్తాంధ్రలో వెనువెంటనే ప్రతిధ్వనించాయి. తెలంగాణలో మాత్రం విభిన్నమైన కవితా వాతావరణం ఉండేది. ఆధునిక ప్రక్రియలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండేవి. కొందరు సాహిత్యకారులు తెలంగాణలో భావ కవిత్వమే లేదని అన్నారు. మరికొందరు కోదాటి రామకృష్ణారావును ఏకైన ప్రతినిధిగా చూపారు. ఏమైనా నవ్య కవిత్వం ఆనాడు తెలంగాణలో నామమాత్రమే. ప్రాచీన ఏకశిలా నగరం, ఓరుగల్లు చారిత్రక వైభవ ప్రాశస్తి రామానుజరావులో బాల్యం నుంచి ఉత్తేజపరిచాయి. నిజాం కాలేజీ విద్యార్థిగా ఉన్నపుడు చేసిన బహు గ్రంథ పఠనం, అపార అధ్యయనం, సూక్ష్మ పరిశీలన ఆయన మేధను సహస్ర దళాలతో వికసింపజేశాయి.
ఆయన నిరంతర గ్రంథ పఠనానికి నిజాం కాలేజీ గ్రంథాలయం ఎంతో ఉపకరించింది. తెలుగు ప్రాచీన కవులు, ఆధునిక కవుల పద్యాలు, గీతాలు అసంఖ్యాకంగా ఆయన నోటికి వచ్చేవి. దానికితోడు అభినవ కవితకు ఆద్యుడైన రాయప్రోలు సుబ్బారావు కవితా ప్రతిభ పట్ల రామానుజరావుకు ఎంతో ఆసక్తి ఉండేది.
దాని ప్రభావంతో తమ ప్రాంతంలో ఉన్న ఇతర కవుల రచనలకు పూర్తి భిన్నంగా, కోస్తాంధ్ర ప్రాంత కవితా రీతికి దగ్గరగా కావ్య రచన చేశారు దేవులపల్లి రామానుజరావు. అందుకు సాక్ష్యమే ‘పచ్చతోరణం’ కావ్యం.
1944లో రామానుజరావు సోదరి కేసమ్మ, ఆమె భర్త నెల్లుట్ల రామకృష్ణామాత్య రాసిన ‘భావార్ణవము’ గ్రంథానికి ఉపోద్ఘాతం రాస్తూ భాషా సేవ పట్ల భావన ఎలా ఉండాలో ఆయన స్పష్టం చేశారు.
‘భాషా ప్రపంచం పరమపవిత్రము. అందు సాహితీరంగం పూజా మందిరము. మత సాంఘిక వైషమ్యాలకు అందు తావు లేదు.
ఆనందోపాసనయే భాషా సేవకుల పరమావధి. ఏదో లేనిపోని కారణములను పురస్కరించుకొని యుద్రేకావశమున యుక్తాయుక్తములు మరచి యాత్మ స్తుతి పరనిందలతో కాలం గడుపుట వలన సాహిత్యమునకు ఎట్టి లాభం కలుగదు. జాతినుత్తేజిత మొనర్చడం భాషా సేవకుల పరమధర్మ ము…’ అని చెప్పుకున్నట్లుగానే అదే ఆలోచనతో, సిద్ధాంతంతో తన జీవితంలోనూ నడవలేదని రచనల ద్వారా, సాహితీ సేవల ద్వారా తెలుస్తున్నది.
తెలంగాణలో తెలుగు భాష నిలబడిందంటే అది ఆయన త్యాగం వల్లనేనని దేవులపల్లి ‘50 సంవత్సరాల జ్ఞాపకాలు’ అనే స్వీయచరిత్ర చదివితే స్పష్టమవుతుంది. పరిషత్ వికాసానికి జీవితంలో అత్యధిక భాగాన్ని వినియోగించిన సంతృప్తి పూర్తిగా తనకు ఉందని ఆయన చెప్పుకునేవారు. ఇంట్లోని వ్యవసాయాన్ని విస్మరించి, సులభంగా సాధించగలిగిన ఉద్యోగాల జోలికి పోకుండా, అనుకూలంగా అవలంబించగలిగిన న్యాయవాద వృత్తి గురించి శ్రద్ధ వహించక, ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి ప్రారంభించిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన మునిగిపోయారు. ‘బంగారు వంటి కోమటి సంగీతము చేత బేరసారములుడుగెన్’… అని బంధుమిత్రులు అంటున్నా..ఎవరు ఏమనుకున్నా ఉత్సాహంతో తెలుగు సాహితీ సముద్రంలో పడి ఈతకొట్టారు. తెలంగాణలో తెలుగా భాష, సంస్కృతుల పెంపు కోసం దరికి చేరిన ప్రతి వేదికను ఉపయోగించుకున్న మహనీయుడు దేవులపల్లి రామానుజరావు.
ఆయన జీవితంలో అధిక భాగం సాహిత్య సమాజంతో ముడిపడింది. పిల్లల కోసం మన దేశం, తెలుగు సీమ, జవహర్లాల్ నెహ్రూ, గౌతమబుద్ధుడు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వంటివి ఆయన రాశారు. ఆయనకు పూర్వం పరిస్థితులు చూసిన విషయాలు, సామాజిక, రాజకీయ, భాషా సంబంధిత విషయాలు, రేడియో ప్రసంగాలు, సాహితీ ఉపన్యాసాల్లో చూడవచ్చు. సంగం లక్ష్మీబాయమ్మను అందరూ జాతీయ ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధురాలిగానే తెలుసు. కానీ రామానుజరావు ఆమెను చిత్రకారిణిగా, కథా రచయిత్రిగా పరిచయం చేశారు. బమ్మెర పోతనను శృంగార కవిగా ఆయన ప్రకటించారు. భాగవతంలో మొత్తం 66 శృంగార రీతులను పోతన చిత్రించారని పరిశీలనాత్మకంగా తేల్చారు. చరిత్ర మరచిన చరితార్థులను ఎందరినో తన సూక్ష్మదృష్టితో లోకానికి తన రచనల ద్వారా ఆయన అందించారు.
నిజాం పాలకులు తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక చరిత్రను మరుగునపరచాలని అనుకున్నారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. తెలంగాణ ప్రాంతీయులకు పోరాడే గుణం ఉన్నది. ప్రజల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, వీరోచిత పోరాటాలను తన రచనల ద్వారా వివరించారు.
రామానుజరావు జీవితం పురస్కారాలతో కొలువలేనిది. గొప్పతనంలో పురస్కారాలకు మించిన గౌరవంతో జీవితాన్ని ఆయన కొనసాగించారు. ప్రముఖ సాహితీవేత్తలు 30 గ్రంథాల వరకు ఆయనకు అంకితమిచ్చారు. ‘మీజాన్’ పత్రిక ద్వారా ‘ఏకశిలా నగర శిలాఫలక కలకల శోభా విభావరి’ అనే బిరుదును దేవులపల్లి పొందారు. తెలుగు సాహిత్యానికి అనుపమానమైన సేవను అందించిన భాషా భక్తుడికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1990 మే 18న డాక్టరేట్‌తో గౌరవించింది. పత్రికా సంపాదకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, వివిధ సంస్థలకు అందించిన సేవలకు గాను ప్రముఖుల మన్ననలను రామానుజరావు అందుకున్నారు.