నిజామాబాద్ : తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, కాళేశ్వరం జలాల ( Kaleshwaram water ) విడుదలపై ముప్కల్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ కేంద్రం వద్ద బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prashanth Reddy ) సోమవారం రక్తదానం ( Blood Donation ) చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేసికాళేశ్వరం జలాలు రైతులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వర్షం కోసం ఎదురు చూస్తుంటే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. మరోవైపు కాళేశ్వరం వద్ద లక్ష క్యూసెక్కుల నీరు, రోజుకు దాదాపు పది టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా పోతున్నాయని పేర్కొన్నారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని కేటీఆర్, హరీష్ రావు కోరితే వారి రక్తాన్ని కోసి పంటలకు చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి మాట్లాడిన భాష రాక్షస భాషని విమర్శించారు.
రక్తాన్ని చల్లుతానని రేవంత్ అన్నందుకే తాము రక్తం ఇవ్వడానికి సిద్ధమయ్యామని వెల్లడించారు. అందుకే ముప్కల్ రివర్స్ పంపింగ్ సాక్షిగా రైతుల తరఫున రక్తదానం చేశామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని రైతులంతా కాళేశ్వరం జలాల కోసం రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి, ఎస్సారెస్పీ పునర్జీవనం ద్వారా రైతులకు సాగునీరు అందేలా సిద్ధం చేశారని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ నొక్కితే కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలోకి చేరతాయని, తమ రక్తంతో పాటు రైతుల రక్తాన్నైనా తీసుకుని రైతులకు వెంటనే కాళేశ్వరం జలాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.