జనగామ టౌన్, జూలై 9 : జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్ల య్య కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మల్లయ్య భార్య అనిత, కుమారుడు భార్గవ్ తదితరులను టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మల్లయ్యది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు.
తన చావుతోనైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఆయన తన ‘సూసైడ్ నోట్’లో రాసి చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. సర్కారు బెనిఫిట్స్ అందించక రాష్ట్రంలో చాలా మంది విశ్రాంత ఉద్యోగుల గుండెలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. మల్లయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అతడి ఆత్మహత్యకు కారకులైన వారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని విశ్రాంత ఉద్యోగులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. దేవీ ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ అందక రాష్ట్రంలో ఇప్పటి వరకు మల్లయ్యతో కలిపి 100 మంది తీవ్ర మానసిక ఒత్తిడితో చనిపోయారని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో మల్లయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. అనంతరం టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒకే విడతలో విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలందరితో కలిసి పోరాడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు, పెన్షనర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు యాదవరెడ్డి, శంకరయ్య, హరిబాబు, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, మాజీ జడ్పీటీసీ బాల్దె సిద్దిలింగం, కౌన్సిలర్ ఉడుగుల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, జూకంటి శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు రావెల రవి, బోళ్ల సంపత్, కొమ్ము రాజు, ఇరుగు సిద్దులు తదితరులు పాల్గొన్నారు.