గోదావరిఖని, జూన్ 12: సింగరేణి సంస్థను నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కంభకోణాలకు తెరలేపుతున్నదని, సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్జీ-1 ఓసీపీ 5లో శుక్రవారం బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. కాంగ్రెస్ సర్కార్ ఓబీ కాంట్రాక్టర్లు, సోలార్ పవర్ ప్లాంట్, డిటోనేటర్ కాంట్రాక్ట్, పవర్ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగిస్తున్నదని ఆరోపించారు.
అధికారిక, సింగరేణి వెబ్సైట్లో ఉన్న లెక్కల ప్రకారం సింగరేణి వ్యాప్తంగా ఆయా గనులపై 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్టు ప్రభుత్వం చూపిస్తున్నదని చెప్పారు. కానీ, ఆర్జీ-1 ఓసీపీ5లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వచేసి ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం 3.6 లక్షల టన్నుల అని చెప్తున్నారని, ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం మట్టి దిబ్బలు, బండలను బొగ్గు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.