యాదాద్రి భువనగిరి : ప్రజలకు ఓటు వేసుకునే అవకాశం లేకుండా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అడ్డుకుంటున్నాడు. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇదే తీరుగా వ్యవహరించాడు. గుట్టలోని 11 వ వార్డు అభ్యర్థిని బెదిరించి పోటీలో లేకుండా చేశాడని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 12వ వార్డులో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సయ్యద్ బాబాను ప్రలోభాలకు గురి చేశారు. కోట్లు డబ్బులు ఇచ్చి ఉపసంహరణ చేసేలా ఎమ్మెల్యే పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గుట్టను కైవసం చేసుకునేందుకు ఎంతటికైనా దిగజారుతిన్నాడని ఆరోపించారు. మహిళా అభ్యర్థులను టార్గెట్ చేసుకుని భయాందోళనకు గురి చేస్తున్నారు. 12వ వార్డు సభ్యురాలు కీర్తి ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ పేరుతో భయపెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను మొత్తం సోదా చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దుర్మార్గానికి ఒడి గొడుతున్నారన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామిక వ్యవస్థకు తెర తీశారని నిప్పులు చెరిగారు.
10 వ వార్డు అభ్యర్థి ఆవుల సాయిని రూ.3 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి సిగ్గు మాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఓటమికి భయపడి దుర్మార్గంగా కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపసంహరణ చేసేందుకు 3 గంటల వరకే సమయం ఉంటే, అధికారులు 5 గంటల వరకు ఉపసంహరణ చేసేలా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. మా హక్కును కాలరాసారని 10 వ వార్డు ఓటర్లు త్వరలో కోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లం, తిరుగు బాటు చేస్తే నీ పార్టీ నామరూపం లేకుండా చేస్తామని హెచ్చరించారు.