గజ్వేల్, జనవరి 7: ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొవడానికే అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నదని, ప్రభుత్వ తీరు దురదృష్టకరమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ అరెస్టులతో మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో భయభ్రాంతులకు గురిచేసేలా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు అనేక రకాలుగా వేధింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతున్నదని, ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై అక్రమంగా బనాయించిన ఏసీబీ, ఈడీ కేసుల్లో పసలేదన్నారు. ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్ పేరు విశ్వవ్యాప్తంగా వినిపించేలా చేసిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్టులతో బెదిరించడం దురదృష్టకరని పేర్కొన్నారు. అసమర్థ విధానాలతో రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. ఏసీబీ విచారణకు తన న్యాయవాదితో వెళ్లిన కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమే అని తెలిపారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యం నడుస్తున్నదని, పరిపాలన చేతకాక ప్రతిపక్షాల గొంతునొక్కే విధంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ బెదిరించడం సిగ్గుచేటన్నారు.
రోజుకో డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం సీఎం చేస్తున్నారని, ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని తెలిపారు. రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతున్నదని, పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని, చట్టబద్ద సంస్థలను ఇష్టానురాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నాదని మండిపడ్డారు. విచారణ సంస్థలు సైతం రేవంత్ ఆడే రాజకీయ క్రీడలో పావులుగా మారడం దురదృష్టకరని వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నవాజ్‌మీరా, కుమార్, రాష్ట్ర నాయకులు దేవీ రవీందర్, విరాసత్‌అలీ, మాజీ ఎంపీపీ పాండు, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కౌన్సిలర్ చందు, నాయకులు అర్జున్‌గౌడ్, రామచంద్రం, కనకయ్య, శ్రీధర్, కిరణ్‌గౌడ్, ఉమార్, నర్సింగరావు, దేవేందర్, కటికే శ్రీను, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.