హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: ప్రపంచమే నివ్వెరపోయేలా శాటిలైట్ ద్వారా సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసుకొనే స్థితికి భారతదేశం చేరుకున్నదని, అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచేలా ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించిందని రక్షణరంగ శాస్త్రవేత్త, జాతీ య భద్రతామండలి సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ‘ఎమెస్కో డాక్టర్ బీవీ పట్టాభిరామ్ చేంజ్ మేకర్-2026’ అవార్డును సతీశ్‌రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి మాట్లాడు తూ త్వరలోనే భారత్ రక్షణరంగంలో గ్లోబల్ సూపర్‌పవర్‌గా నిలుస్తుందని ధీమా వ్య క్తంచేశారు. ప్రపంచంలో శక్తివంతమైన రక్ష ణ ఉత్పత్తులను తయారుచేసే దేశాల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నదని అన్నారు. ఒకప్పుడు 100 శాతం ఆయుధ దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు 70 శాతం కంటే ఎక్కువ ఆయుధాలను స్వదేశీ సాంకేతికతతోనే తయారు చేస్తున్నదని వెల్లడించారు. భారత్ రూపొందించిన క్షిపణి వ్యవస్థలు అంతరిక్ష శాటిలైట్ సాయంతో సుదూర లక్ష్యాలను పిన్ పాయింట్ కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఒకే క్షిపణి మూడు వేర్వేరు సుదూర లక్ష్యాలను ఛేదిస్తుందని తెలిపారు.
దేశంలో ప్రస్తుతం సుమారు 25వేల పరిశ్రమలు రక్షణరంగానికి అనుబంధంగా పనిచేస్తున్నాయని అన్నారు. తనకు ఇచ్చిన బీవీ పట్టాభిరా మ్ అవార్డును డీఆర్డీవోలో పనిచేస్తున్న వే ల మంది శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. సతీశ్‌రెడ్డి సాధించిన విజయాలను వివరించే పుస్తకాన్ని ఎమెస్కో విజయ్‌కుమార్, చిరంజీవి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి సత్యప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు, సీనియర్ సంపాదకుడు కే రామచంద్రమూర్తి, జయాపట్టాభిరామ్ పాల్గొన్నారు.