Forgetfulness | మారిన మన జీవన విధానం అనేక రకాల శారీరక, మానసిక సమస్యల బారిన పడేలా చేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో మతిమరుపు కూడా ఒకటి. వయసు పైబడిన వారిలోనే కాకుండా యువతలో కూడా ఈ సమస్యను మనం చూడవచ్చు. పేర్లను మరిచిపోవడం, వాక్యం మధ్యలో పదాలను మర్చిపోవడం, వస్తువులను ఉంచిన స్థానాలను మర్చిపోవడం, చదివిన వాటిని మర్చిపోవడం వంటి సమ్యలతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారనే చెప్పవచ్చు. అయితే మతిమరుపు రావడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మెదడు సరిగ్గా పనిచేయాలంటే అనేక రకాల పోషకాలు అవసరమవుతాయి. విటమిన్ బి12, విటమిన్ డి, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్ వంటి పోషకాలు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడు పనితీరును పెంచడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. కనుక విటమిన్ బి12 ఉండే గుడ్డు, ఆకుకూరలు, పాలు, చేపలు, మాంసం వంటి ఆహారాలను తీసుకోవాలి. శాకాహారులు విటమిన్ బి12 సప్లిమెంట్స్ ను వైద్యుల సలహాతో ఉపయోగించాలి. పోషకాలు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య రాకుండా ఉంటుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రోజుకు కనీసం 6 గంటలు కూడా నిద్రించడం లేదు. దీంతో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. కనుక రోజూ 8 గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. మెదడుకు కావల్సిన విశ్రాంతిని అందించాలి. దీంతో మతిమరుపు బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఆందోళన, ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మెదడుకు విశ్రాంతి లభించదు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దేనిపై కూడా దృష్టిని కేంద్రీకరించలేకపోతారు. కనుక ఒత్తిడి, ఆందోళన తగ్గే యోగా, ధ్యానం వంటివి చేయాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. శరీరంలో థైరాయిడ్ స్థాయిలు పెరగడం వల్ల కూడా మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ స్థాయిలు పెరగడం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కనుక తరచూ థైరాయిడ్ స్థాయిలు పరీక్షించుకుంటూ థైరాయిడ్ సంబంధిత మందులు వాడడం చాలా అవసరం. థైరాయిడ్ స్థాయిలు అదుపులో ఉండడం వల్ల శరీరంతో పాటు మెదడు పనితీరు కూడా పెరుగుతుంది.
హార్మోన్ హెచ్చుతగ్గుల కారణంగా స్త్రీలలో మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా గర్బధారణ సమయంలో, మోనోపాజ్ దశలో స్త్రీలలో మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మతిమరుపుతో బాధపడే వారు ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.