బాకు, డిసెంబర్ 27: ఈ నెల 25న కూలిపోయిన అజర్బైజార్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం వెనుక విదేశీ శక్తులు ఉండొచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. విదేశీ భౌతిక, సాంకేతిక శక్తుల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఎయిర్లైన్స్ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నట్టు సమాచారం. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నదని ప్రభుత్వ అనుకూల వెబ్సైట్ కాలిబర్ శుక్రవారం ఒక కథనాన్ని ప్రచురించింది. ఘటనా స్థలిలో విమానం ముందు భాగం దెబ్బ తినడాన్ని గమనిస్తే అది క్షిపణి దాడికి గురైనట్టు అనిపిస్తున్నదని సైన్య, విమానయాన నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో పెద్ద చప్పుడు వచ్చిందని. ఆ తర్వాత విమానం మద్యం తాగి ఊగినట్టు ప్రవర్తించిందని.. అది తామెక్కిన విమానమేనా, కాదా అన్న అనుమానం వచ్చినట్టు ప్రవర్తించిందని తెలిపాడు. మరోవైపు తమ దేశ క్షిపణి దాడి వల్లే విమానం కుప్పకూలిందన్న వార్తలను రష్యా ఖండించింది.