తిమ్మాజిపేట : పశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం, ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నివారణ వ్యాధి టీకాను తప్పనిసరిగా వేయించాలని రాష్ట్ర వెటర్నరీ బయోలాజికల్ , రీసర్చ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్ర పర్యవేక్షణ అధికారి డాక్టర్ లక్ష్మణ్ ( Deputy Director Laxman ) రైతులకు సూచించారు. శుక్రవారం తిమ్మాజీపేట మండలం ఆవంచ, గుమ్మకొండ గ్రామాల్లో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా టీకా ప్రాముఖ్యత గురించి వివరించారు. టీకా వలన పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. పశువుల కాళ్లకు గడ్డలు, నోటిపుండ్లు, జొల్లు కార్చడం, మేతమేకపోవడం లాంటి వ్యాధులను ఈ టీకా దూరం చేస్తుందన్నారు. ప్రతి పశువుకు ఆరు నెలలకు ఒకసారి ఈ టీకాను తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.
లేని పక్షంలో పశువు ఆరోగ్యం దెబ్బతిని, నిరసించిపోయి పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని ఆయన తెలిపారు. టీకాలను జాగ్రత్తగా ఉంచాలని, వాటిని ఐస్ప్యాక్లో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పశు వైద్యాధికారి జ్ఞాన శేఖర్, స్థానిక పశువైద్యాధికారులు డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.