Folic Acid | మహిళలు గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా రోజూ పౌష్టికాహారం తీసుకోవాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటారు. అయితే గర్భిణీలకు కావల్సిన పోషకాల్లో ఫోలిక్ యాసిడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీన్నే ఫోలేట్ అని కూడా అంటారు. ఇతర పోషకాల మాదిరిగానే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను కూడా వేసుకోవాలని గర్భిణీలకు వైద్యులు సూచిస్తుంటారు. ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో అవసరం. ఇది కణాల నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి అవసరం అవుతుంది. శిశువు ఎలాంటి పుట్టుక లోపాలు లేకుండా జన్మించాలంటే అందుకు కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. ఫోలిక్ యాసిడ్ వల్ల మహిళలకు నెలసరి సక్రమంగా వస్తుంది. అదే గర్భిణీలకు అయితే శిశువుకు ఎంతో మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తింటే మహిళలు గర్భం దాల్చడంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి.
గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. జీర్ణాశయ సంబంధ కణజాల నిర్మాణానికి కూడా ఫోలేట్ అవసరం అవుతుంది. అలాగే వెన్నెముకను దృఢంగా మారుస్తుంది. పిల్లల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే రక్తహీనత వస్తుంది. దీని వల్ల వారిలో శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదు. అలాగే యుక్త వయస్సు వచ్చిన బాలికల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే రజస్వల కాలేరు. రజస్వల అయ్యాక ఈ పోషక పదార్థం లోపిస్తే అప్పుడు నెలసరి సరిగ్గా అవదు. గర్భధారణ కూడా ఆలస్యం అవుతుంది. బాలింతలు లేదా 30 ఏళ్లు దాటిన స్త్రీలలో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే వారిలో ఎముకలు బలహీనంగా మారి పెళుసుగా తయారవుతాయి. దీంతో అవి చిన్న దెబ్బలు లేదా గాయాలకు సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఫోలిక్ యాసిల్ లోపం ఉన్న మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో తేలింది.
ఫోలిక్ యాసిడ్ లోపిస్తే మహిళల్లో జుట్టు రాలుతుంది. ఆకలి సరిగ్గా ఉండదు. ఏమీ తినాలనిపించదు. ముఖం పాలిపోయినట్లు అవుతుంది. కొందరు బరువు కూడా తగ్గుతారు. నీరసం, అలసట ఉంటాయి. చిన్న పని చేసినా సరే తీవ్రమైన అలసట వచ్చినట్లు ఫీలవుతారు. బద్దకం విపరీతంగా ఉంటుంది. ఇక గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను వాడాలని డాక్టర్లు సూచిస్తుంటారు. వాటిని రోజూ వేసుకోవడం వల్ల గర్భస్థ శిశువుల్లో మెదడు, వెన్నెముక, నాడీ మండల వ్యవస్థ సరిగ్గా నిర్మాణం అవుతాయి. ఫోలిక్ యాసిడ్ సరిగ్గా లభించకపోతే శిశువులు జన్మించిన తరువాత మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కనుక గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. కచ్చితంగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను వాడాలి. ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తీసుకోవాలి.
ఫోలిక్ యాసిడ్ మనకు ఆకుకూరల్లో అధికంగా లభిస్తుంది. కనుక అన్ని రకాల ఆకుకూరలను తరచూ తింటుండాలి. దీంతో ఫోలిక్ యాసిడ్ లోపం ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా పాలకూరలో మనకు ఫోలిక్ యాసిడ్ అత్యధికంగా లభిస్తుంది. అలాగే తోటకూర, చుక్కకూరలను కూడా తినవచ్చు. ఇక బీన్స్, ఇతర చిక్కుడు జాతి గింజలు, పప్పు దినుసులు, నిమ్మజాతి పండ్లు, టమాటాలు, మటన్ లివర్, బ్రౌన్ రైస్, పొద్దు తిరుగుడు విత్తనాలు, పల్లీలు, పుట్టగొడుగులు, బొప్పాయి, క్యారెట్లు, బీట్ రూట్, పచ్చి బఠానీలు, చేపలు, పాలు, అరటి పండ్లు. మొక్కజొన్న, పైనాపిల్, క్యాబేజీ, ఆలుగడ్డలు, చిలగడదుంపలు, గోధుమలను ఆహారంలో భాగం చేసుకుంటే ఫోలిక్ యాసిడ్‌ను పొందవచ్చు. ఇలా ఆయా ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఈ పోషక పదార్థం లోపం రాకుండా ఉంటుంది.