Ram Gopal Varma |ఇండియన్ సినిమాకి కొత్త దిశ చూపించిన ‘శివ’ (1989) చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కింగ్ నాగార్జున – దర్శకధీరుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ ఇప్పుడు 4K ఫార్మాట్, డాల్బీ అట్మాస్ సౌండింగ్‌తో నవంబర్ 14న థియేటర్లలో తిరిగి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో పంచుకుంటూ ‘శివ’ సినిమా ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. “శివ సినిమా కాదు… అది ఒక విప్లవం. తెలుగు సినిమా మార్గదర్శిని మార్చిన చిత్రం అదే. ఆ రోజే నాకు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్తు అనిపించాడు. నాగార్జున అద్భుతంగా నటించాడు. మొత్తం టీమ్‌కు హ్యాట్సాఫ్!” అని చిరు తన వీడియోలో అన్నారు.
చిరంజీవి వీడియోపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ తన X (ట్విట్టర్) లో రిప్లై ఇచ్చారు.“థ్యాంక్యూ చిరంజీవి గారు. అనుకోకుండా నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి ధన్యవాదాలు,” అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో ఆయన చిరంజీవిని ట్యాగ్ చేయడంతో, సోషల్ మీడియాలో ఆర్జీవీ క్షమాపణలు టాప్ ట్రెండ్‌గా మారాయి.గతంలో చిరంజీవి – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ‘వినాలని ఉంది’ అనే సినిమా ప్రారంభమైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో, ఊర్మిళా మతోండ్కర్ హీరోయిన్గా ఈ ప్రాజెక్ట్ కొంతవరకు షూట్ కూడా పూర్తయ్యింది. అయితే, ఆ సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి విడుదల కావడం, వర్మ ఆయనతో కమిట్ అయిన సినిమా పూర్తి చేయాల్సిన పరిస్థితులు రావడంతో, ఆర్జీవీ ఈ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేశారు.
దీంతో చిరంజీవి నిరాశ చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు. పైగా వర్మ అప్పుడప్పుడూ మెగా ఫ్యామిలీపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు చేసినా, చిరు ఎప్పుడూ స్పందించలేదు. ఇక ‘శివ’ రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి ప్రశంసలు కురిపించడంతో ఆర్జీవీ మనస్ఫూర్తిగా స్పందించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఎవరినీ పబ్లిక్‌గా క్షమించమని కోరని రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మెగాస్టార్‌కు “సారీ” చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.