SSMB 29 | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా (SSMB 29) గురించి ఇప్పటికే సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయిలో, హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సూపర్ స్కేల్ విజువల్స్, అడ్వెంచర్ థీమ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమా టైటిల్, మహేష్ బాబు లుక్, టీజర్లను నవంబర్ 15న విడుదల చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్‌ను జియో సినిమా, హాట్‌స్టార్ ప్లాట్‌ఫార్మ్‌లలో లైవ్‌గా ప్రసారం చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సినీప్రియులందరూ ఈ ఈవెంట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఇప్పటికే అభిమానులకు ఒక సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృద్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కుంభ” అనే అంగవైకల్యం కలిగిన వ్యక్తిగా ఆయన లుక్ రోబోటిక్ వీల్‌చెయిర్‌లో కూర్చున్న శైలిలో ఉండి, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లుక్ చూసి ఫ్యాన్స్ – “ఇది రాజమౌళి విజన్‌కి నిదర్శనం” అని కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరో మైండ్‌బ్లోయింగ్ సర్ప్రైజ్ను కూడా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను నవంబర్ 11న విడుదల చేయనున్నారు. ఈ అప్డేట్ను అదే రోజు అధికారికంగా ప్రకటించి, లుక్‌ను రివీల్ చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి సినిమాలు ఆలస్యమైనా, అప్డేట్స్ మాత్రం వరుసగా ఇస్తున్నారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “సినిమా ఎప్పుడో రానుందిలే కానీ, జక్కన్న ఇచ్చే సర్ప్రైజ్లు చాలు ఫుల్ ఫీలింగ్ వస్తోంది!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి — మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ SSMB 29 సినిమాపై క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇక నవంబర్ 11, 15 తేదీలతో ఈ ఫ్యాన్ ఫెస్టివల్ మరింత వేడెక్కనుంది!