Foam In Urine | మన శరీరం నుండి వెలువడే వ్యర్థాల్లో మూత్రం కూడా ఒకటి. ప్రతిరోజూ మనం 6 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేయాలి. మూత్రం రంగును బట్టి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే మూత్రం రంగు మాత్రమే కాకుండా మనం విసర్జించే మూత్రంలో వచ్చే నురుగను బట్టి కూడా మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. నురుగుతో కూడిన మూత్రం అన్ని వేళల్లా ప్రమాదకరం కానప్పటికీ నిరంతరం నురుగు రావడం, అధికంగా నురుగు రావడం వంటి పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా వైద్యున్ని సంప్రదించాలని చెబుతున్నారు. అసలు మూత్రంలో నురుగు ఎందుకు వస్తుంది..? ఎలాంటి సందర్భాల్లో వైద్యున్ని సంప్రదించాలి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనం మూత్ర విసర్జన వేగంగా చేసినప్పుడు అది టాయిలెట్ బౌల్ ను వేగంగా తాకి నురుగు వస్తుంది. ఈ నురుగు త్వరగా తగ్గిపోతుంది. ఇలాంటి నురుగుకు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే శరీరంలో డీహైడ్రేషన్ వల్ల కూడా మూత్రంలో నురుగు వస్తుంది. డీహైడ్రేషన్ కు గురి అయినప్పుడు మూత్రంలో ద్రావణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మూత్రంలో నురుగు ఎక్కువగా వస్తుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఈ పరిస్థితి నుండి సులభంగా బయటపడవచ్చు. సాధారణంగా మూత్రపిండాలు ప్రోటీన్ ను నిలుపుకుంటాయి. మూత్రపిండాలు బలహీనపడినప్పుడు ఈ ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకుపోతుంది. దీంతో మూత్రంలో నురుగు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం.
అలాగే మూత్రపిండాల ఇన్పెక్షన్లు, అధిక రక్తపోటు వంటి వాటితో మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. దీని వల్ల కూడా మూత్రంలో నురుగు ఎక్కువగా వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. అంతేకాకుండా మూత్రనాళాలు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో కూడా మూత్రం నుండి నురుగు ఎక్కువగా వస్తుంది. తరుచూ మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలగడం, పొత్తి కడుపులో నొప్పి, మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఇక డయాబెటిస్ తో బాధపడే వారిలో కూడా మూత్రం నుండి నురుగు ఎక్కువగా వస్తుంది. కనుక వీరు తరుచూ డయాబెటిస్ తో పాటు మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో కూడా మూత్రంలో నురుగు ఎక్కువగా వస్తుంది. అదే విధంగా గర్భిణీ స్త్రీలల్లో కూడా మూత్రం నుండి నురుగు వస్తుంది. గర్భిణీ స్త్రీలల్లో ప్రోటీన్ విసర్జన ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. నీటిని తాగినప్పటికీ మూత్రంలో నురుగు రావడం, కాళ్లు, చేతుల్లో వాపులు రావడం, అధిక రక్తపోటు, అలసట, మూత్రవిసర్జన చేసే సమయంలో అసౌకర్యంగా ఉండడం, తరచూ మూత్రంలో నురుగు ఎక్కువగా రావడం వంటి సందర్భాల్లో కూడా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.