America | అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహస్సీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ కాల్పులకు పాల్పడింది లియోన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ జెస్సికా ఇక్నర్ కుమారుడు.. 20 ఏండ్ల ఫీనిక్స్ ఇక్నర్ అని సమాచారం. ఇక్నర్ తన తల్లికి చెందిన మాజీ సర్వీస్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. ఇక్నర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
స్టూడెంట్ యూనియన్ సమీపంలో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు సమాచారం అందడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది క్యాంపస్‌ను వీడి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. దాదాపు ఉదయం 11:50 గంటలకు స్థానిక సమయంలో కాల్పులు ప్రారంభమయ్యాయి, పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని నిలువరించారు. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్లోకి వెళ్లింది, గురువారం జరగాల్సిన తరగతులు, క్రీడా కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లు రద్దయ్యాయి. ఈ ఘటన గురించి అధికారులు అధ్యక్షుడు ట్రంప్‌కు సమాచారం చేర్చారు. ఆయన ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, దీనిని భయంకరమైన సంఘటనగా పేర్కొన్నారు.