సిటీబ్యూరో, నవంబరు 4 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని పలుచోట్ల అకస్మాత్తుగా వెలసిన ఫ్లెక్సీలపై రోజంతా అందరిలోనూ విస్తృత చర్చకు దారి తీసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మోసపోయాం..మీరు మోసపోకండి అంటూ ఫ్లెక్సీలను బస్టాండ్ వేదికగా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా 6 వేల ఇందిరమ్మ ఇండ్లు కనబడడం లేదంటూ సంబంధిత ఫ్లెక్సీలో పేర్కొనడంపై చర్చకు దారి తీసింది. ఇప్పటికే కంటోన్మెంట్ నుంచి కొంత మంది మహిళలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాస్‌రావు ఓ పాత్ర సన్నివేశంలో వేలాడ దీసిన కోడిని చూస్తూ అదే చికెన్‌తో భోజనం చేస్తున్నట్లుగా …కంటోన్మెంట్ ప్రజల పరిస్థితి మారిందంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు.
చేతిలో కోడి మాంసాన్ని పట్టుకుని ప్రభుత్వ లోపాలను మహిళలు ఎత్తిచూపారు. అంతేకాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం సీఎం రేవంత్‌రెడ్డికి కంటోన్మెంట్ అభివృద్ధిపై సవాల్ విసిరారు. కంటోన్మెంట్లో రూ.4వేల కోట్ల అభివృద్ధి జరిగినట్లు చూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తలసాని విసిరిన సవాల్‌కు ప్రభుత్వం పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, తాజాగా వెలిసిన ఫ్లెక్సీలతో నియోజకవర్గంలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. కంటోన్మెంట్ తరహాలో తాము మోసపోమంటూ ఓటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.