వేణుగానం జయప్రదం
రేపల్లెను మురిపించిన మురళి, గోపికలను బులిపించిన రవళి.. జయప్రదా రామమూర్తిని కూడా వేణుగాన విద్వాంసురాలిని చేసింది. తొలి మహిళా ఫ్లూటిస్ట్‌గా రికార్డులకు ఎక్కించింది. వేణువుతో జయప్రద స్నేహం ఓ రేణువులానే మొదలైంది..
రేపల్లెను మురిపించిన మురళి, గోపికలను బులిపించిన రవళి.. జయప్రదా రామమూర్తిని కూడా వేణుగాన విద్వాంసురాలిని చేసింది. తొలి మహిళా ఫ్లూటిస్ట్‌గా రికార్డులకు ఎక్కించింది. వేణువుతో జయప్రద స్నేహం ఓ రేణువులానే మొదలైంది..
ఇంటి పనుల్లో తలమునకలైన ఆ గృహిణికి ఇంపైన వేణుగానం వినిపించింది. తను కూడా గాయని కావడంతో ఆ వాద్య సంగీతాన్ని మనసారా ఆస్వాదించింది. ‘ఎవరిదో ఈ మురళీ గానం..’ అనుకుంటూ తలతిప్పి చూసింది. తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఎదురుగా కూతురు.. జయప్రద. చేతిలో వేణువు. స్వరానికి తగ్గట్టు పిల్లనగ్రోవిని పలకరిస్తున్న ప్రాణవాయువు. అప్పటికి జయ వయసు పన్నెండు. జయప్రదా రామమూర్తి కుటుంబీకులు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందినవారు. తాతల కాలంలోనే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి వెంకటరమణ రామమూర్తి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్. తల్లి ప్రేమా రామమూర్తి సంగీత విద్వాంసురాలు. ఇంట్లో కర్ణాటక సంగీతం మారుమోగేది. తండ్రి శాస్త్రవేత్త కావడంతో అనేకానేక విషయాల మీద లోతైన చర్చలు జరిగేవి. కాబట్టే, ‘ఫ్లూటిస్ట్ కాకపోయి ఉంటే కచ్చితంగా ఐఏఎస్ అధికారిని అయ్యేదాన్ని’ అంటారు జయప్రద. వేణుగానం మీద మక్కువతో, పాకెట్ మనీలో నుంచి రూ.60 ఖర్చుపెట్టి ఫ్లూట్ కొనుక్కున్నారు జయప్రద. తొలిరోజుల్లో సొంతంగానే సాధన చేసినా.. ఆ తర్వాత నటేషన్ రమణి దగ్గర శిష్యరికం చేశారు. హరిప్రసాద్ చౌరాసియా సమక్షంలో కొంతకాలం సాధన చేశారు.
సంగీతమా? చదువా?
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. గడ్డుకాలం వచ్చి తీరుతుంది. జయప్రద కూడా అలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. తండ్రి అకాల మరణం ఆ కుటుంబంలో ఓ పెద్ద కుదుపు. చదువు, వేణుగానం.. ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐఏఎస్ ఆలోచనకు స్వస్తి పలికారు. సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు. ‘ఏదైనా సాధించాలనుకుంటే మనసులో గట్టిగా సంకల్పించుకుంటే సరిపోతుంది’ అనే మాట జయప్రద విషయంలో నిజమైంది. గొప్ప ఫ్లూటిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలనేది ఆమె లక్ష్యం. అందుకు అనుక్షణం శ్రమించారు. కఠోర సాధన చేశారు. వందలాది ప్రదర్శనలిచ్చారు. అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఓసారి టెలివిజన్‌లో జయప్రద వేణుగానాన్ని తిలకించారు, ఆలకించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ద్వారా జయప్రదను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించారు. కచేరీ పెట్టించారు. ‘ఎప్పటికైనా నువ్వు గొప్ప వేణుగాన విద్వాంసురాలివి అవుతావు’ అంటూ ప్రశంసించారు.
సినిమాల్లోకి..
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా ద్వారా జయప్రద వెండితెర ఫ్లూటిస్ట్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘బాహుబలి-2’, ‘వకీల్‌సాబ్’ వంటి పెద్ద సినిమాలకూ పనిచేశారు. త్వరలోనే, సంగీత దర్శకుడు కోటి నేతృత్వంలో ఓ ప్రాజెక్టు కోసం పని చేయనున్నారు. తన వేణుగాన ప్రస్థానంలో జయప్రద ఎన్నో రికార్డులు సాధించారు. ఆమె ఇరవై రకాల ఫ్లూట్స్ వాయించగలరు. స్వరాల నాణ్యత వేణువు పైనే ఆధారపడుతుంది. కాబట్టే అస్సాం, బొంబై, చెన్నై, బెంగళూరు నుంచి వేణువులు తెప్పించుకుంటారు. అన్నమయ్య లక్ష గళార్చన కార్యక్రమానికి గానూ.. ప్రపంచ రికార్డు నమోదు చేశారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి నేషనల్ ఫెలోషిప్ కూడా అందుకున్నారు. కంచి పీఠం, శ్రీశైలం, గురువాయూర్, యాదాద్రి, వేములవాడ తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఆస్థాన విద్వాంసురాలుగానూ ఉన్నారు జయప్రద.
ప్రపంచ దేశాల్లో..
చదువుకునే రోజుల్లో ప్రపంచ పటంలో వివిధ దేశాల పేర్లు చూసి ‘భూమి మీద ఇన్ని దేశాలున్నాయా? వీలైతే అన్నీ చుట్టేయాలి’ అనుకునేవారు జయప్రద. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. రష్యా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. వేల కచేరీలు చేసినా.. ప్రతి కచేరీని తొలి ప్రదర్శనగానే భావిస్తారు. అంతే శ్రద్ధగా శ్రోతల్ని అలరిస్తారు. కొన్నివేల కరతాళ ధ్వనులు ఆమె వేణుగాన ప్రతిభకు సాక్ష్యాలుగా నిలిచాయి. తన దగ్గరికి వచ్చేవారికి ఆమె చెప్పే మాట ఒకటే.. ‘వేణుగానాన్ని నేర్చుకోవాలనుకుంటే, ముందుగా ఆ కళను ప్రేమించడం మొదలుపెట్టండి. ఉపాధిలా కాకుండా ఒక ఉద్యమంలా స్వీకరించండి. సాధన చేస్తూనే ఉండండి’.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

