ఉత్తరకాశీ, ఆగస్టు 5: దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో జల విలయం బీభత్సం సృష్టించింది. పవిత్ర చార్ధామ్లలో ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి గ్రామంపై మంగళవారం ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కుంభవృష్టి కారణంగా వచ్చిన మెరుపు వరదలకు కొండచరియలు విరిగిపడి ఇళ్లు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తుకు నలుగురు మృత్యువాత పడగా మరో 60-70 మంది గల్లంతయ్యారు. భారతీయ సైనిక శిబిరం ఉన్న హార్సిల్‌లో కూడా కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 10 మంది జవాన్లు గల్లంతైనట్లు తెలుస్తున్నది. సహాయ చర్యల కోసం చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో వాయు దళానికి చెందిన హెలికాప్టర్లను సిద్ధం చేశారు.
పేక మేడల్లా కూలిన భవనాలు
గంగానది జన్మస్థానం గంగోత్రికి వెళ్లే మార్గంలో యాత్రికులు ప్రధానంగా విశ్రాంతి తీసుకునేది ధరాలి గ్రామంలోనే. ఇక్కడే అనేక హోటళ్లు, రెస్లారెంట్లు, హోం స్టేలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడి బురదతో నిండిన వరద నీరు ముంచెత్తడంతో సగం ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. వరద ప్రవాహం వేగానికి మూడు, నాలుగు అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సమీపంలోని ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో హఠాత్తుగా కుండపోత వాన కురవడంతో కొండల మీదుగా వరద ప్రవహిస్తూ ధరాలి గ్రామంలో బీభత్సాన్ని సృష్టించింది. కొండకు మరో పక్కన ఉన్న సుక్కి గ్రామం కూడా విపత్తుకు లోనైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు.
సహాయ చర్యలకు ఆటంకం
మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా సాయంత్రం వరకు కొనసాగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడడంతో ఐదు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు, రెండు సరిహద్దు రహదారులతోసహా 168 రోడ్లకు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరద తాకిడికి గురైన ప్రదేశాలకు చేరుకోవడం సహాయక సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ధరాలికి అత్యంత సమీపంలో హార్సిల్‌లో ఉన్న సైనిక శిబిరం నుంచి సైనిక సిబ్బంది హుటాహుటిన ధరాలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సుమన్ తెలిపారు. రోడ్డు తెగిపోవడం, ప్రతికూల వాతావరణం కారణంగా ఇతర ప్రాంతాల నుంచి సహాయక బృందాలు రావడానికి ఆలస్యం కానున్నట్లు ఆయన చెప్పారు. ఆకస్మిక వరదలకు 40, 50 భవనాలు దెబ్బతిన్నట్లు ఉత్తరాఖండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కే సుధాంశు తెలిపారు.
గతంలో ఎన్నడూ చూడని విధంగా..
ధరాలి మార్కెట్లోని అధిక భాగం కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 20-25 హోటళ్లు, కొన్ని హోంస్టేలు తుడిచిపెట్టుకుపోయినట్లు రాజేష్ పన్వర్ అనే స్థానికుడు తెలిపారు. కొండలపై నుంచి ఉధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి ఇళ్లు, పంటలు కొట్టుకుపోతున్న దృశ్యాలను పర్యాటకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, ఇటువంటి విపత్తును తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. హార్సిల్ ప్రాంతంలోని ఖీర్ గడ్ కాలువ పొంగి ప్రవహిస్తుండడంతో నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఉత్తరకాశీ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సంయుక్తంగా రంగంలోకి దిగాయి.