చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఈ-రోడ్ జిల్లా శివగిరి సమీపంలో గురువారం చోటు చేసుకున్నది. ఈ-రోడ్ జిల్లా సొలంగపాళయం సమీపంలోని ముత్తుకౌండంపళయం గ్రామానికి చెందిన కుమరేశన్, అతని బంధువులు కలిసి పళనికోయి నుంచి ఓమ్నీ వ్యాన్‌లో తిరిగి వస్తుండగా శివగిరి సమీపంలోని పరపాళయం సమీపంలో ఈ-రోడ్ నుంచి శివగిరి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి.
ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఘటన జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఉండగా.. డ్రైవర్‌తో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా.. తీవ్రగాయాలపాలైన వారిని ఈ-రోడ్ ఆసుప్రతికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి శివగిరి పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు సమాచారం.