కాలిఫోర్నియా: శరీరంలోని జీవ కణాలలో కలిగే రసాయనిక మార్పులకు సంబంధించిన స్టెటోహెపటైటిస్ (ఎంఏఎస్హెచ్)కు చికిత్సలో భరోసానిచ్చే ఔషధాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. ఎంఏఎస్హెచ్ అనేది ఊబకాయం, టైప్ 2 మధుమేహంతో సంబంధం గల ఫ్యాటీ లివర్ తీవ్ర రూపం. ఇది సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ మందును ఐఓఎన్224 అని పేర్కొంటున్నారు. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని, మంట పుట్టడాన్ని ఆపుతుంది.
మూడోదశ పరీక్షలు విజయవంతమైతే..
ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి శరీరంలోని జీవ కణాలలో కలిగే రసాయనిక మార్పులతో బాధపడేవారికి ఎంఏఎస్హెచ్ సోకుతుంది. దీనిని నిశ్శబ్ద రోగం అంటారు. ఎందుకంటే, ఇది ఎటువంటి లక్షణాలను ప్రదర్శించకుండా సంవత్సరాల తరబడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మూడో దశ పరీక్షల్లో కూడా ఈ కొత్త ఔషధం విజయవంతమైతే, రోగులకు చికిత్సలో ఉపయోగిస్తామన్నారు. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకోక ముందే చికిత్స చేయగలుగుతామని తెలిపారు.