ISS : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు (Astronauts) సురక్షితంగా భూమిపైకి చేరారు. ఐఎస్ఎస్లో ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు ఇటీవల నాసా (NASA) ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన వ్యోమగామి సహా నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన క్రూ-11 డ్రాగన్ వాహకనౌక ఎండీవర్ గురువారం అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది.
క్రూ-11 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను నాసా ఇటీవల ప్రకటించింది. జనవరి 8న (అమెరికా కాలమానం ప్రకారం) వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ 6.5 గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే చివరి నిమిషంలో దీన్ని నాసా నిలిపివేసింది. క్రూ-11 మిషన్‌లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ.. వ్యోమగాములను మిషన్ పూర్తికాకముందే తిరిగి భూమ్మీదకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
వాస్తవానికి ఫిబ్రవరిలో ఈ మిషన్ పూర్తికావాల్సి ఉండగా, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఒక నెల ముందే మిషన్‌ను ముగించారు. అయితే గోప్యతా కారణాలు, ప్రొటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. ఇదిలాఉండగా అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు తలెత్తడం చాలా అరుదు. గతంలో మైక్రోగ్రావిటీవల్ల వ్యోమగాముల్లో రక్తసరఫరా సరిగా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చినట్లు సమాచారం. అయితే ఆ కేసులను నాసా బయటకు వెల్లడించలేదని తెలుస్తోంది.