Supreme Court : ఐ-ప్యాక్ కార్యాలయం (I-PAC office) ప్రాంగణంలో సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం (Bengal govt), సీఎం (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ‘ఈడీ’ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు (Supreme Court) చాలా తీవ్రమైన అంశంగా పేర్కొంది. ఇటీవల ఈడీ దాడుల కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు (Kolkata High Court) లో చోటుచేసుకున్న గందరగోళంపై కలత చెందినట్లు తెలిపింది.
ఈడీ పిటిషన్లో లేవనెత్తిన అంశాలను పరిశీలించకపోతే అది చట్టవిరుద్ధమే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జి, ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్‌కు నోటీసులు జారీచేసింది. ఐప్యాక్‌పై దాడులకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను భద్రపర్చాలని బెంగాల్ పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘సోదాల సమయంలో బెంగాల్ సర్కారు, సీఎం మమత జోక్యం చేసుకోవడం, అవరోధాలు కల్పించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన ధోరణిని ప్రతిబింబిస్తోంది. గతంలోనూ కేంద్ర సంస్థలు తమ చట్టబద్ధమైన అధికారాలను వినియోగించినప్పుడల్లా.. సీఎం జోక్యం చేసుకుని అడ్డుకున్నారు. ఇలాంటి వైఖరి కేంద్ర సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈడీ చట్టప్రకారమే పనిచేస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనుమానిత సామగ్రిని స్వాధీనం చేసుకోదు. ఐ-ప్యాక్ కార్యాలయంలో బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధరణకు వచ్చేందుకు ఆధారాలు ఉన్నాయి. సోదాల అడ్డగింత వ్యవహారంలో ఇటీవల ఈడీ పిటిషన్‌పై కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ఇతర వ్యక్తులు కోర్టులోకి ప్రవేశించారు. దీంతో కేసు వాయిదా పడింది. ప్రజాస్వామ్యం స్థానంలో మూకస్వామ్యం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఇటీవలి ఘటనల సమయంలో అక్కడ కనిపించిన అధికారులను సస్పెండ్ చేయాలి’’ అని వాదించారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈడీ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ కేసును మొదట కలకత్తా హైకోర్టు విచారించాలన్నారు. ఈడీ సమాంతర విచారణలు జరుపుతోందని ఆరోపించారు. సోదాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను ప్రస్తావిస్తూ.. సీఎం మమతా బెనర్జీ అన్ని డిజిటల్ పరికరాలను తీసుకెళ్లారనేది అబద్ధమన్నారు. ఈడీ సోదాల రికార్డు ద్వారానే ఇది నిరూపితమైందని చెప్పారు. ‘బొగ్గు కుంభకోణం కేసులో 2024 ఫిబ్రవరిలో చివరి వాంగ్మూలం నమోదు చేశారు. అప్పటినుంచి ఈడీ ఏం చేస్తోంది? ఎన్నికల వేళ ఈ కేసులో ఇంత ఆసక్తి ఎందుకు?’ అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.
బెంగాల్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి జనవరి 8న సాల్ట్ లేక్‌లోని రాజకీయ సంప్రదింపుల సంస్థ ‘ఐ-ప్యాక్’ కార్యాలయంలో, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ కోల్‌కతా నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. దీనికి ఆటంకాలు ఎదురైన నేపథ్యంలో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తునకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సీఎం వెంట తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు.ఈడీ తన పరిధిని అతిక్రమించిందని దీదీ ఆరోపించారు. దర్యాప్తునకు ఆమె ఆటంకం కలిగించారన్న ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ సైతం ఖండించింది. రాష్ట్ర పోలీసులు ఈడీ అధికారులపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.