కథల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు తమిళ హీరో శివకార్తికేయన్. సోమవారం ఆయన కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ‘సెయాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మించనున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అమరన్’ తర్వాత శివకార్తీకేయన్ మరోమారు కమల్‌హాసన్ నిర్మాణంలో సినిమా చేస్తుండటం విశేషం.
సోమవారం సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్ చేతిలో పొడవాటి కత్తిని పట్టుకొని రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నెమళ్లు కనిపిస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్‌గా అభివర్ణించే కార్తీకేయుడిని తమిళంలో ‘సెయాన్’ అనే పేరుతో కూడా పిలుస్తారు. గ్రామీణ నేపథ్యంలో ఆధ్యాత్మిక, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రమిదని, శివకార్తికేయన్ పూర్తి మాస్ అవతారంలో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది.