వేసవితాపం మొదలైంది.. రోజురోజుకూ సూర్యు డు మండిపోతున్నాడు.. పగలు వేడి సెగలు, ఉక్కపోత.. రాత్రి వేళ చలిగాలులతో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. గురువారం మెదక్ జిల్లాలో 40డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తప్పని పనులు ఉంటేనే జనం బయటకి వస్తుండగా, మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కూలీలు, కార్మికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టవళ్లు, టోపీలు, మహిళలు చున్నీలు అడ్డంపెట్టుకుని ఎండవేడిమిని నుంచి రక్షణ పొందుతున్నారు. వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురవకుండా ఎక్కువ నీటిని తాగుతూ మజ్జిగ, పండ్ల రసాలు లాంటివి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.
ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వేడిగాలులతో మధ్యాహ్నం ప్రధాన రోడ్లన్నీనిర్మానుష్యంగా మారుతున్నాయి. గతేడాది కంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇండ్లల్లో ఉండే వారు ఏసీలు, కూలర్లు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మరి కొంతమంది చెట్ల కింద సేద తీరుతున్నారు. మూగజీవాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.ఎండలో మేతకు తీసుకుపోకుండా చూడాలని, పశువుల పాక, కొట్టాల్లోనీటిని చల్లాలని, నీటితో తడిపిన తట్టు సంచులు వేయాలని జాగ్రత్తలు చెబుతున్నారు. పంటలకు ఎండ సమయంలో నీటి తడులను కాల్వ ద్వారా పారించాలని, దీంతో ఏపుగా పెరుగుతాయని సూచిస్తున్నారు.
మెదక్/న్యాల్కల్, మార్చి 17: భానుడు తన ప్రతాపాన్ని చూపుతూ నిప్పులు చెరుగుతున్నాడు. దీనికి తోడు వడగాల్పులు, ఎండవేడిమి పెరగడంతో ఉక్కబోతకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అత్యవసరం అనుకుంటే ఉదయమే ప్రయాణమతున్నారు. వేసవి కాలం పూర్తి స్థాయిలో రానేలేదు అప్పుడే ఎండలు మండుతున్నాయి. కొద్ది రోజులుగా ఎండలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజులు వ్యవధిలోనే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీలకు చేరుకున్నాయి. మెదక్ జిల్లాలో చాలా చోట్ల గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. కూలీలు, కార్మికులు, రైతులు ఎండలకు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వారం రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతూ వస్తున్నది. మార్చి మూడో వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా 36 నుంచి 40 డిగ్రీలకు ఎండలు చేరుకున్నాయి. జాగ్రత్తలు పాటించకపోతే వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో ఎండకు మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
కొందరు ఎండ వేడిమి నుంచి రక్షణ కోసం గొడుగులు, టవల్స్, టోపీలు అడ్డుపెట్టుకుంటున్నారు. కాగా మహిళలు చున్నీలు కప్పుకుని తిరుగుతున్నారు. ఎండలు పెరుగుతుండడంతో రైతన్నల పరిస్థితి వర్ణణాతీతం. మెదక్ జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న, ఇతర పంటలు సాగులో ఉన్నాయి. పొలాలకు నీరు పెట్టేందుకు పగటి పూట వెళ్లాల్సి వస్తుండడంతో ఎండ ధాటికి ఇబ్బందులు పడుతున్నారు.
వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుంది. ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందుకే వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క రూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు తాగడం మంచిది. వేసవిలో ఉపశమనం కోసం కర్భూజ, దోసకాయలు, ఇతర పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు వహించాలి. ఎండ వేళలో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసెస్, టోపీ, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.
మెదక్ జిల్లాలో వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నెల 10న 36.9 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. 11న 35.8, 12న 36.3, 13న 36.8, 14న 36.8, 15న 38.6, 16న 39.6, 17న గురువారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో 40 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు కూడా దాటే అవకాశం ఉన్నది.
ఎండకాలం వచ్చేసింది.. ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వడ దెబ్బతో మరింత ప్రమాదం. 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు రోడ్లపైకి రావద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్‌కు బదులు, మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. వేసవిలో ఉపశమనం కోసం కర్భూజ, దోసకాయలు, ఇతర
పండ్లు తీసుకోవాలి.