Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయపూడి సమీపంలోని ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఇది గమనించిన స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నించారు. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతుండటంతో మంటలను అదుపు చేయడం కష్టతరమైంది. అయితే ఈ అగ్ని ప్రమాదం నిజంగానే ప్రమాదమా? లేదా కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 11వ తేదీన కూడా అమరావతిలోని వెలగపూడి దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కూడా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు చేస్తున్న ఎల్అండ్టీ కంపెనీకి చెందిన రూ.కోట్ల విలువైన హెచ్డీపీ పైపులకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మరవకముందే మరో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.