Ashwatthama | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఆదిత్య ధర్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భారీ యాక్షన్ విజువల్స్, పవర్ఫుల్ కథనంతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ కూడా అదే జోష్‌ను కొనసాగిస్తూ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లు సాధించగా, ఫుల్ రన్లో రూ.2000 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని సమాచారం. ఈ భారీ విజయంతో ఆదిత్య ధర్ రేంజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.
ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వథామ’ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను కలగలిపిన ఈ భారీ యాక్షన్ డ్రామా, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక మైలురాయిగా నిలవనుందని అంచనాలు ఉన్నాయి. భారతీయ పురాణాల్లో కీలకమైన పాత్రగా నిలిచిన అశ్వథామ కథను ఆధునిక కాలానికి అనుగుణంగా మలిచే ప్రయత్నం ఈ సినిమాలో ఉండబోతోందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, కథనం ప్రతి అంశంలోనూ హాలీవుడ్ స్థాయిని లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమా రూపొందించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అక్షరాలా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోగా ఎవరు నటిస్తారు అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేదా బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరు అశ్వథామగా కనిపించినా, అది బాక్సాఫీస్ వద్ద మరో భారీ సంచలనానికి దారితీస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆదిత్య ధర్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో, సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.