
సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ): విద్యార్థులను ఓటరు నమోదు కార్యక్రమంలో భాగం చేసే విధంగా అన్ని కాలేజీలకు నోటీసులు పంపాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 5న ఓటరు తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల పర్యవేక్షకులు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి ఓటరు జాబితా సవరణపై సమీక్షించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఓటరు జాబితా అభ్యంతరాలు, సవరణలపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
హైదరాబాద్ జిల్లా పరిధి లో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ప్రజలను కోరారు. భార త ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2022 విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈనెల 27, 28 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఎల్ఓలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్‌లో అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో తప్పుగా ఉన్న పేరు, అడ్రస్ ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. బుధవారం కమిషనర్ స్వీప్ కమిటీ సభ్యులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై వర్చువల్ మీటింగ్ జరిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పంకజ, సీపీఆర్ఓ మహ్మద్ ముర్తుజా, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కె. వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ బచ్చన్సింగ్, మీడి యా కమ్యూనికేషన్ పీఐబీ డిప్యూటీ డైరెక్టర్‌వి.గాయత్రి, హైదరాబాద్ నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డినేటర్ కుమారి ఖుష్బూగుప్త, ఆల్ ఇండి యా రేడియో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ లక్ష్మి,బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యన్.యస్.యస్ కో-ఆర్డినేటర్వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.